నేడు నోటిఫికేషన్ విడుదల..


Wed,February 13, 2019 11:52 PM

జిల్లాలో 467 గ్రామ పంచాయతీలుండగా.. 465 పంచాయతీలలో 3806 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. జనవరి 11న మొదటి విడత, 25న రెండో విడత, 30న మూడో విడత ఎన్నికలను నిర్వహించారు. ఇందులో బేల మండలంలోని మాంగ్రూడ్, కొబ్బాయి పంచాయతీపై కోర్టులో కేసు ఉండగా.. ఈ రెండు పంచాయతీలకు ఎన్నికల నుంచి మినహాయించారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామం ఏజెన్సీలో ఉండగా.. ఈ గ్రామంలో ఎస్టీ కుటుంబాలు లేవు. దీంతో ఈ పంచాయతీలో సర్పంచ్ పదవి కోసం నామినేషన్లు దాఖలు కాలేదు. ఎన్నికల అధికారి ఏజెన్సీ కుటుంబాలు ఈ గ్రామంలో లేవని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదికను సమర్పించారు. ఈ పంచాయతీకి మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాలేదు. మిగతా గ్రామ పంచాయతీల్లోని కొన్ని వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాక పోవడంతో ఈ వార్డుల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ నిర్ణయించింది. గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. 14నుంచి 16వరకు నామినేషన్ల స్వీకరణ, 17న స్క్రూట్నీ, 18,19న అభ్యంతరాల స్వీకరణ, 20న నామినేషన్ల ఉప సంహరణ 3గంటల వరకు ఉంటుంది. అదే రోజు బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటించి గుర్తులను కేటాయిస్తారు. 28న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికలతో మళ్లీ ఆయా గ్రామాల్లో సందడి నెలకొననుంది.


ఎన్నికలు జరిగే వార్డులివే..
జిల్లా వ్యాప్తంగా 27 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో ఈ వార్డుల్లో ఎన్నికలను నిర్వహించడానికి నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. బేల మండలంలోని గణేశ్‌పూర్ గ్రామంలో 4వ వార్డు, 5వ వార్డు, బోథ్ మండలంలోని పార్డీ(బి)లో 5,6వ వార్డు, ఇచ్చోడ మండలంలోని దేవలంకి తండా 6వ వార్డు, మల్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని 2వ వార్డు, సాలయాదలోని 1వ వార్డు, జైనథ్ మండలంలోని కూర గ్రామ పంచాయతీ పరిధిలోని 1, 2,3,4,5,6,7,8 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. నార్నూర్ మండలంలోని భీంపూర్ పంచాయతీ పరిధిలో ఉన్న 3,4వార్డులు, కొత్తపల్లి హెచ్ పంచాయతీ పరిధిలో 6వ వార్డు, సిరికొండ మండలంలోని జెండాగూడ పంచాయతీ పరిధిలో 6వ వార్డు, నేరడిగొండ(జి) పంచాయతీ పరిధిలో 8వ వార్డుకు ఒక్క నామినేషన్ రాలేదు. ఉట్నూర్ మండలంలోని డొంకచింత 1,8వ వార్డు, టక్కిగూడ పంచాయతీ పరిధిలో 1,2,4,8వ వార్డులు కలిపి మొత్తం 27వార్డులకు ఎన్నికలను నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల కానుంది.

190
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles