గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి


Mon,February 11, 2019 11:05 PM

కడెం : గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఎంపీపీ భుక్యా అమ్మి సూచించారు. సోమవారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీటీసీలు, కడెం, దస్తురాబాద్ మండలాల్లోని సర్పంచులు హాజరయ్యారు. నూతన సర్పంచులను ఎంపీడీవో కార్యాలయ అధికారులు ఘనంగా సన్మానించారు. వ్యవసాయశాఖ అధికారిణి సంధ్యారాణి మాట్లాడుతూ రైతులకు వానాకాలం పంటలకు రూ. 6 కోట్ల 82 లక్షలు, యాసంగి పంటలకు రూ. 74కోట్ల24 లక్షలను రైతుబంధు ద్వారా పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతుబీమా చెక్కులు కడెంలో 12 మందికి, దస్తురాబాద్‌లో ఐదుగురు రైతులకు అందజేసినట్లు తెలిపారు. కృషి సంచాయ్ యోజన పథకం కింద కడెం మండలంలోని ఉడుంపూర్, దస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్ గ్రామాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. నీటి సామర్థ్యం లేని గ్రామాల్లో ఈ పథకం ద్వారా పంటల సాగు చేపట్టనున్నట్లు వివరించారు. కడెం మండలంలో 9611 మంది రైతులకు, దస్తురాబాద్ మండలంలో 3409 మంది రైతులకు రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ కడెం పీహెచ్‌సీలో 502 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించి, 32 మందికి నార్మల్ డెలివరీ చేసినట్లు చెప్పారు. 451 మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ చేశామన్నారు.


మండల విద్యాధికారి నేత గోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేశామని, కిచెన్ షెడ్ల నిర్మాణం త్వరలోనే చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాసాయిపేట ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థలో ఉందని సర్పంచ్ మెలుగూరి రాముగౌడ్ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దార్ రాజేశ్ మాట్లాడుతూ కడెం మండలంలో మొత్తం 25 రేషన్ దుకాణాలున్నాయని, సివిల్‌సైప్లె ద్వారా 11 వేలకు పైగా లబ్ధిదారులకు బియ్యం, కిరోసిన్ పంపిణీ చేస్తున్నారన్నారు. అయితే అనేక మంది లబ్ధిదారులు రేషన్‌కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని, రేషన్‌కార్డులు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టాల విషయమై అధికారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు.

పశుసంవర్ధకశాఖ అధికారి విజయ్ మాట్లాడుతూ కడెం మండలంలో 433 మందికి సబ్సిడీ ద్వారా గొర్రెల పంపిణీ చేసినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ జేఈఈ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ మిషన్ కాకతీయ-4లో భాగంగా ఉడుంపూర్, చిట్యాల, ఎలగడప, ఇస్లాంపూర్ గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు అధికారుల దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. కల్లెడ గ్రామ ప్రత్యేక అధికారి గడ్డం శ్రీనివాస్‌మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో ప్రత్యేక చొరవ చూపినందున అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఈవోపీఆర్డీ వెంకటేశ్, కడెం తహసీల్దార్ రాజేశ్, దస్తురాబాద్ తహసీల్దార్ విశ్వంభర్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు భూమన్న, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

277
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles