కులవృత్తుల సంక్షేమానికి పెద్దపీట


Mon,November 19, 2018 01:03 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : కులవృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాల చారి అన్నారు. తలమడుగు మండలం దేవాపూర్‌లో ఆదివారం నిర్వహించిన ముదిరాజ్ మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కుల సంఘాలు కీలక పాత్ర వహించాయని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిని మెరుగుపర్చేందుకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా బడ్జెట్‌లో సైతం భారీగా నిధులు కేటాయించామన్నారు. గొల్ల, కుర్మలకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను అందజేయడంతో పాటు మార్కెటింగ్ కోసం వాహనాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. దళితబస్తీ పథకంలో భాగంగా మూడువేల ఎకరాల భూమిని పేద దళిత కుటుంబాలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమాతో పాటు పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. బోథ్ నియోజకవర్గంలో కుప్టి, గోముత్రి, పిప్పల్‌కోఠి ప్రాజెక్టుల నిర్మాణంతో ఇక్కడి భూములు సస్యశ్యామలంగా మారనున్నాయన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మహాకూటమి అభ్యర్థులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, గతంలో వారు చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. బోథ్ నియోజకవర్గాన్ని గత పాలకులు ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. అంతకుముందు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు సలెందర్ శివయ్య, చాగంటి నరేశ్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

291
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...