అధినేత వస్తున్నారు..!

Fri,November 16, 2018 11:17 PM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: గులాబీ అధినేత కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేసేందుకు ఈ నెల 22న వస్తున్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచార సభల షెడ్యూల్ ఖరారు చేశారు. మలి విడత ప్రచారంలో భాగంగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఈ నెల 22న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించి.. ప్రచార సభల్లో పాల్గొంటారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ (బోథ్ నియోజకవర్గం), ఖానాపూర్, నిర్మల్, ముథోల్‌లో నిర్వహించే ఎన్నికల శంఖారావ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగం చేస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ రోజుకు నాలుగైదు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 22న ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించనున్నారు.

స్వయంగా ఫోన్ చేసిన కేసీఆర్
ఈ నెల 22న మధ్యాహ్నం నిర్మల్ పట్టణంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటానని.. మిగతా మూడు చోట్ల కూడా ప్రచార సభలు ఉంటాయని సీఎం కేసీఆర్ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. సోన్ మండలం జాఫ్రాపూర్‌లో మంత్రి అల్లోల ఎన్నికల ప్రచారంలో ఉండగా.. పార్టీ అధినేత కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. నిర్మల్‌తో పాటు ఇచ్చోడ, ఖానాపూర్, ముధోల్ వస్తున్నానని.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం కేసీఆర్ మంత్రి అల్లోలకు సూచించారు. దీంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, బోథ్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు రాథోడ్ బాపురావు, అజ్మీరా రేఖానాయక్, గడ్డిగారి విఠ్ఠల్‌రెడ్డిలు సీఎం కేసీఆర్ ప్రచార సభల ఏర్పాట్లపై దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ హాజరయ్యే ప్రచార సభలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకుగాను అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. భారీగా జన సమీకరణ చేసి.. తమ సత్తా చాటేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

కొనసాగుతున్న వలసలు
మరోవైపు టీఆర్‌ఎస్ పార్టీలో వలసలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి సొంత గూటికి చేరారు. శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గడ్డం అరవింద్‌రెడ్డి మంచిర్యాల టికెట్ ఆశించగా.. ఆయనను కాదని కొక్కిరాల ప్రేంసాగర్‌రావుకు ఇచ్చారు. బలమైన నేతగా, ప్రజల్లో మంచి పట్టున్న నాయకుడిగా ఉన్న గడ్డం అరవింద్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌లో చేరారు. 2001 పార్టీ ఆవిర్భావం నుంచి గడ్డం అరవింద్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారు. 2014ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా ఆయన మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. ఆయన పార్టీ వీడటంతో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయనతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఇప్పటికే చెన్నూర్‌లో సీనియర్ నాయకులు దుర్గం అశోక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేగళ్ల విజయ్‌తో పాటు చెన్నూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక వీరి బాటలోనే మరికొందరు నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుంచి ముఖ్య నాయకులు గులాబీ పార్టీలో చేరాలని భావిస్తున్నారు.

349
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles