నేడే ఎన్నికల నోటిఫికేషన్


Mon,November 12, 2018 12:15 AM

- కొనసాగుతున్న ఏర్పాట్లు
- నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజక వర్గాలు ఉండగా ఈ నియోజక వర్గాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 3,77,562 మంది ఓటర్లు ఉండగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1,96,849 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 98,645, పురుషులు 98,157 మంది ఉన్నారు. వీరితో పాటు 47 మంది ఇతరులు ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో 1,80,713 మంది ఓటర్లు ఉండగా పురుషులు 89,239 మంది, మహిళలు 91,459 మంది ఉన్నారు. వీరితో పాటు 16 మంది ఇతరులు ఉన్నారు. ఇటీవల నిర్వహించిన ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 3012 మంది, బోథ్‌లో 1536 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 518 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 261, బోథ్‌లో 257 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ నిర్వహణ కోసం అవసరమైన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లు జిల్లాకు చేరుకోగా వీటి ద్వారా ఓటు వేసే విధానాన్ని అధికారులు ప్రజలకు తెలియజేశారు.

రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ ఆర్‌వోలకు ఎన్నికలు, బాధ్యతలు విధులు, కోడ్ అఫ్ కండక్ట్, అభ్యర్థుల ఎన్నికల వ్యయం, వీవీ ప్యాట్ల వినియోగం, అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన, తిరస్కరణ లాంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో అభ్యర్థులు సోమవారం నుంచి తమ నామినేషన్లు దఖాలు చేసుకునే అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. కలెక్టర్ ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. అధికారులు ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ఎన్నికల సామగ్రి సరఫరా, పోలింగ్ సిబ్బంది నియామకం వంటి ప్రక్రియ కొనసాగుతోంది. పోలీసు అధికారులు సైతం ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. జిల్లాలో 71 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 25, బోథ్‌లో 46 ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సమస్య పరిష్కారంలో భాగంగా సంబంధింత సిబ్బంది అక్కడికి చేరుకునేలా పోలింగ్ కేంద్రాలను జియో ట్యాగింగ్‌తో అనుసంధానించారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా రాష్ట్రస్థాయి అధికారులు సైతం జిల్లాలోని పోలింగ్ కేంద్రాల కదలికలను తెలుసుకొనే అవకాశం ఉంది.

334
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...