బీ-ఫారాలు అందాయి..!

Mon,November 12, 2018 12:13 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : కారు హైస్పీడ్‌తో దూసుకుపోతోంది. సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేయగా.. అదే రోజున 105 మంది అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్ రికార్డు సృష్టించారు. ఇక నోటిఫికేషన్‌కు ముందు రోజే అందరూ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసి దూకుడుగా వెళ్తున్నారు. జిల్లాలోని టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని టీఆర్‌ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీ-ఫారాలను అందజేశారు. సోమవారం రోజున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు ఒక రోజు ముందే బీ-ఫారాలను అందించారు. నామినేషన్ల ప్రక్రియ షురూ చేసేందుకు ముందే బీ-ఫారాలు అందించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. రెండు నెలలుగా ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రచారం తీరు తెన్నులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏయే నియోజకవర్గంలో ప్రచారం ఏ విధంగా చేస్తున్నారో అభ్యర్థులను అడగడంతో పాటు తన వద్ద ఉన్న సమాచారాన్ని వారితో పంచుకున్నారు. పాక్షిక మ్యానిఫెస్టోపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందో అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రచారం మరింత వేగవంతం చేయాని సూచించారు. ఈ నెల 12 నుంచి 19 వరకు మంచిరోజు చూసుకొని నామినేషన్ వేసేందుకు ముహూర్తం పెట్టుకోవాలని చెప్పినట్లు సమాచారం. నామినేషన్ ప్రక్రియ తర్వాత ప్రచారం మరింత వేగవంతం చేసేలా చూసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో అభ్యర్థులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీ-ఫారాలు నింపేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు తీసుకు రావాలని పార్టీ కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. ఈ మేరకు అభ్యర్థులు ఓటరు జాబితాలోని ధ్రువీకరణ పత్రంతో పాటు అభ్యర్థుల కేసులకు సంబంధించిన ధ్రువపత్రాలు తీసుకొని వెళ్లారు. అభ్యర్థులందరికీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బీ-ఫారాలు అందజేశారు. దీంతో ఈ నెల 12 నుంచి 19 వరకు నామినేషన్లు వేసుకొనేందుకు గడువు ఉండగా.. ఈ నెల 14, 19 తేదీల్లో మంచి రోజులు ఉండగా.. ఎక్కువ మంది అభ్యర్థులు అదే రోజున వేసే అవకాశాలున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభలు, నియోజకవర్గంలో ఒక్కో సభ నిర్వహించాలనే ప్రతిపాదనలపై అభ్యర్థులతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి.. బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

373
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles