కారు జోరు.. హస్తం బేజారు

Sun,November 11, 2018 12:31 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: సెప్టెంబర్ 6న అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేయడంతో పాటు.. అదేరోజున 105 మంది అభ్యర్థులను ప్రకటించి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా.. తొమ్మిది మంది సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వగా.. చెన్నూర్‌లో మాత్రం ఎంపీ బాల్క సుమన్‌కు టికెట్ కేటాయించారు. రెండు నెలలకు పైగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఇంటింటా ప్రచారం నిర్వహిస్తుండగా.. అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారు. ఇప్పటికే రెండు నెలలు గడిచిపోగా.. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ జారీకి సమయం ఆసన్నమైంది. సోమవారం రోజున (నవంబర్ 12) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరో అడుగు ముందుకేస్తున్నారు. ఇప్పటికే టికెట్లు ప్రకటించిన అభ్యర్థులందరికి స్వయంగా బీ-ఫారాలు అందించాలని నిర్ణయించారు. ఆదివారం రోజున టీఆర్‌ఎస్ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి ఆహ్వానం
పార్టీ ఎంపిక చేసిన పది మంది అభ్యర్థులు ఆదివారం హైదరాబాద్ రావాలని ఆహ్వానం పంపించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అభ్యర్థులకు బీ-ఫారాలు అందిస్తారు. పార్టీ నాయకత్వం నుంచి ఆహ్వానం రావడంతో అభ్యర్థులంతా హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈనెల 12 నుంచి 19వ తేదీ వరకు మంచి ముహూర్తాలు చూసుకొని నామినేషన్లు వేసుకునేందుకు సిద్ధం కావాలని అధినాయకత్వం అభ్యర్థులకు సూచిస్తోంది. 105 మంది జాబితా ప్రకటించాక కొన్ని రోజులకు సీఎం కేసీఆర్ అభ్యర్థులతో సమావేశమై నాయకుల సమన్వయం, గ్రామ, మండల, నియోజకవర్గ సమావేశాలపై ఇప్పటికే సమీక్షించారు. లబ్ధిదారుల జాబితాను అభ్యర్థులకు అందజేసి ఇంటింటి ప్రచారం చేయాలని దిశా నిర్దేశం చేశారు. కొన్ని రోజులుగా అభ్యర్థులు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. నేటి సమావేశంలో అభ్యర్థుల ప్రచారం తీరుపై పార్టీ అధినేత సమీక్షించి దిశా నిర్దేశం చేయనున్నారు.

కాంగ్రెస్‌లో గందరగోళం
ఒకవైపు నోటిఫికేషన్ వెలువడేందుకు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కారు జోరు కొనసాగుతుండగా.. హస్తం మాత్రం బేజారవుతోంది. దసరా, దీపావళి పండుగలు గడిచిపోయినా.. ఇప్పటివరకు అభ్యర్థుల ప్రకటన లేకపోవడంతో ఆశావహులతో పాటు కిందిస్థాయిలో నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. నేడు, రేపు అంటూ ఊరిస్తున్న జాబితా చివరికి ఆదివారానికి వాయిదా పడింది. జాబితా ప్రకటన వరుసగా వాయిదా పడడం, నోటిఫికేషన్ జారీకి ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఆశావహుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఆదివారమైనా తొలి జాబితా వస్తుందో లేదోనని ఉత్కంఠ నెలకొంది. అసలు జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోననే ఆందోళన ఉంది. ప్రచారానికి 25 రోజులు గడువు మాత్రమే ఉండడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అసంతృప్తులను ఏ విధంగా బుజ్జగించాలో, ప్రచారం ఎప్పుడు చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఆశావహులంతా హైదరాబాద్, ఢిల్లీలో మకాం వేశారు. తమకంటే తమకు టికెట్ ఇవ్వాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే ఖానాపూర్ టికెట్‌ను రాథోడ్ రమేశ్‌కు ఇవ్వొద్దంటూ హరినాయక్ గాంధీభవన్ ఎదుట అమరణ నిరాహర దీక్ష చేస్తున్నారు.

446
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles