అడుగడుగునా జేజేలు

Tue,September 18, 2018 11:43 PM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : అసెంబ్లీ రద్దు అనంతరం జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పదిరోజులుగా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో జిల్లా వ్యాప్తం గా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు గ్రామాల్లో మోటార్‌సైకిల్ ర్యాలీ లు, సమావేశాలు ఏర్పాటు చేసి నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులకు లభిస్తోన్న ప్రజాదరణను చూసి ప్రతిపక్షాల నాయకులు బేజారవుతున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండగా.. తాజాగా మరో నాయకుడు తెరపైకి వచ్చారు. జిల్లా కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు సాజిద్‌ఖాన్ తనకు టికెట్ ఇవ్వాలంటూ హైదరాబాద్‌లో ఆ పార్టీ నేతల కు వినతిపత్రం అందజేశారు. దీంతో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య నలుగురుకి చేరింది. ఇప్పటికే పీసీసీ కార్యదర్శి సుజాత, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన భార్గవ్ దేశ్‌పాండే ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఫలితంగా ఇప్పటికే కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాట కొనసాగుతుండగా, సాజిద్‌ఖాన్ సైతం పార్టీ టికెట్ ఆశిస్తుండడం తో ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోధరలకు నిరసనగా ఇటీవల ప్రతిపక్షాలు చేపట్టిన భారత్‌బంద్‌లో భాగంగా జిల్లా కేంద్రంలో నాలుగు వర్గాలకు చెందిన నాయకులు వేర్వేరుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

బోథ్ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ పార్టీలో మూడు గ్రూపులున్నాయి. అనిల్‌జాదవ్ ఇప్పటికే రెండుసార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి అండతో తనకు టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన జాదవ్ నరేశ్ కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన సోయం బాపురావు కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తన కే దక్కుంతుందనే నమ్మకంతో ఉన్నారు. ఎవరికివారు తమ టికెట్ విషయంలో పైరవీలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో మూడు గ్రూపుల వారు వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తుండడంతో అంతర్గత విబేధాలు ఎక్కువయ్యాయి.

జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం పట్టణాలు, గ్రామాల్లో హోరెత్తుతోంది. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చడంతో ప్రజలు తిరిగి టీఆర్‌ఎస్ పాలనను కోరుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు బిత్తరపోతున్నారు. గ్రామాల్లోని ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానికులు మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే బాపురావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరుతున్నారు. ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులకు రైతులు, మహిళలు, యువకులు మంగళహారతులు, డప్పు చప్పుళ్లు, నృత్యాల తో ఘన స్వాగతం పలుకుతున్నారు. సమావేశాల్లో నాయకులు అనుమతితో మైకు తీసుకొని సర్కారు అమలు చేసిన పథకాలతో తమకు ఎలాంటి లబ్ధి చేకూరిందో వివరిస్తున్నారు. రైతుబంధు, ఆసరా పిం ఛన్లు, కల్యాణలక్ష్మి, అమ్మఒడి, రెసిడెన్షియల్ పాఠశాలలు, దళితబస్తీ, రోడ్ల నిర్మాణం, ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల పంపిణీ, కంటి వెలుగు లాంటి పథకాలను తెలియజేస్తుండడంతో స్థానికుల చప్పట్లతో ప్రభుత్వ పథకాలకు ఆమోదం తెలియజేస్తున్నారు.

214
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles