ప్రైవేటు దవాఖానలకు అనుమతులు తప్పనిసరి


Wed,September 12, 2018 11:40 PM

ఇచ్చోడ : ప్రైవేట్ దవాఖానలను నెలకొల్పి వైద్యం అందిస్తున్న ఆర్‌ఎంపీలు కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాజీవ్ రాజ్ అన్నారు. ఇచ్చోడలో కొన్ని ప్రైవేట్ దవాఖానలకు ఎలాంటి అనుమతులు లేవని, మరి కొందరు ఆర్‌ఎంపీలకు గుర్తింపు సర్టిఫికేట్లు లేకుండానే రోగులకు వైద్యం అందించడం నేరమన్నారు. ఇచ్చోడలోని ప్రైవేట్ దవాఖానలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలకు చెందిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడారు. ఇచ్చోడలో ప్రైవేట్ క్లీనిక్‌లను నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీలు రోగుల నుంచి ఎక్కువ మొత్తంలో కన్సెల్టెన్సీ ఫీజులు వసూళ్లు చేస్తున్నారన్నారు. గుర్తింపు సర్టిఫికెట్లు లేకుండా వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. డీఎంఅండ్‌హెచ్‌వో తనిఖీలు చేపట్టుతున్నారని గమనించిన కొందరు ఆర్‌ఎంపీ లు వారి క్లీనిక్‌లకు తాళం వేసి అక్కడి నుంచి జారుకున్నారు. దీనిపై డీఎంఅండ్‌హెచ్‌వో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చోడలోని సుమారు 18 ప్రైవేట్ క్లీనిక్‌లు ఉన్నట్లు వారు గుర్తించారు. వీరందరికీ మూడు రోజుల్లో నోటీసులను జారీ చేస్తామని చెప్పారు. నోటీసులు అందుకున్న ఆర్‌ఎంపీలు సంజాయిషీ ఇవ్వాలని, లేని పక్షంలో వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తన తనిఖీల్లో ప్రైవేట్ వైద్యులు క్లీనిక్‌లలో నిత్యం పరిశుభ్రత పాటించడంలేదని తేలిందన్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో వెంట సీనియర్ అసిస్టెంట్లు గుజరాతి గోపి, మహేందర్ ఉన్నారు.

335
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles