ప్రజాక్షేత్రంలోకి గులాబీ దళం

Wed,September 12, 2018 12:32 AM

-ప్రచారంలో టీఆర్‌ఎస్ ముందడుగు
-ఇంటింటా తిరుగుతూ.. సమావేశాలతో బిజీబిజీ
-సంక్షేమ పథకాలతో పల్లెల్లోకి గులాబీ అభ్యర్థులు
-టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఊరూవాడ నీరాజనం
-తేలని పొత్తులతో కాంగ్రెస్ నాయకుల బేజారు
-ముందుకెళ్లలేక.. వెనక్కి తగ్గలేక అయోమయం
-క్షేత్రస్థాయిలో టీడీపీ-కాంగ్రెస్ సమన్వయం కష్టమే
నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల ప్రకటనతో ముందడుగు వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా.. తొమ్మిది నియోజక వర్గాల్లో సిట్టింగులకే టికెట్లను ఇస్తున్నట్లు ప్రకటించింది. చెన్నూర్ నియోజక వర్గం మినహా.. మిగతా అన్ని నియోజక వర్గాల్లో పాత కాపులకే టికెట్లు ఖరారు చేశారు. చెన్నూర్‌లో మాత్రం ఎంపీ బాల్క సుమన్ పేరును ప్రకటించింది. తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు పార్టీ, ప్రభుత్వపరంగా సముచిత స్థానం కల్పిస్తామని.. రెండు, మూడు రోజు ల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీ ముఖ్యుల వద్దకు తీసుకెళ్లనున్నారు. పది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటి కే మండలాలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వ పథకాలతో పల్లెల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. లబ్ధి పొందిన వారి కుటుంబాలతో స్వయంగా మాట్లాడుతున్నారు. కుల సంఘాలు, యువజన సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఊరూవాడా తేడా లేకుండా కలియతిరుగుతున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులకు ప్రజలు నీరాజ నం పలుకుతున్నారు.

రాష్ట్ర మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మకాం వేశారు. ఈ నెల 7న అభ్యర్థులను ప్రకటించగా.. 8న తమ సొంత నియోజకవర్గాలకు చేరుకున్నారు. వీరికి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. విపక్షాల ఊహకు కూడా అందని విధంగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా.. పది నియోజకవర్గాలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మండలాలు, గ్రామాల వారీగా షెడ్యూ ల్ ఖరారు చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గ్రామాల వారీగా, మండలాల వారీగా తయారు చేసుకుంటున్నారు. వివిధ ప థకాల ద్వారా వ్యక్తిగతంగా జరిగిన లబ్ధికి సంబంధించి లబ్దిదారుల జాబితాను సిద్ధంగా ఉంచుకున్నారు. గ్రామాల వారీగా ప్రచారానికి వెళ్లినప్పుడు సంబంధిత మండలం, గ్రామంతో పాటు వ్యక్తిగతంగా జరిగిన లబ్ధిని వివరిస్తున్నారు. లబ్ధిదారులకు సంబంధించి నేరుగా వెళ్లి వారీగా మండల, గ్రామస్థాయి నాయకులు కలిసి మాట్లాడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు పలు గ్రామాల్లో పర్యటించి ప్రచారంలో ముందడుగు వేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కల్లోలం నెలకొంది. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా మారింది హస్తం పార్టీ. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలుండగా.. ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా.. అన్ని చోట్ల వర్గపోరు నెలకొంది. ప్రతి నియోజకవర్గంలో ఎవరికి వారే తమకు టికెట్ వస్తుందంటే.. తమకు వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ కోసం రాష్ట్ర, ఢిల్లీ స్థాయిలోని ముఖ్య నాయకులతో ఎవరికి వారు తమ ప్రయత్నా లు చేస్తున్నారు. అధికారం కోల్పోయి నాలుగున్నరేళ్లు గడిచినా.. ఇంకా సమన్వయం కుదరలేదు. నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికి వారు.. గ్రూపులుగా విడిపోయారు. ఆదిలాబాద్, ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లో మూడు గ్రూపులు, ముథోల్, సిర్పూర్ (టి), చెన్నూ ర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో రెండు గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది.

ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, ఇప్పటికే ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా నాయకులు ఉండడంతో క్యాడర్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకరికి టికెట్టు వస్తే మరొక వర్గం పని చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటివరకు పొత్తుల పంచాయతీలు తేలలేదు. పొత్తుల్లో భాగంగా ఎవరికి ఏ స్థానాలు కేటాయిస్తారనేది గందరగోళంగా మారింది. అభ్యర్థులు ఎవరనేది తేలకపోగా.. అంతా అయోమయంలో ఉన్నారు. ఇక క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్-టీడీపీ క్యాడర్ సమన్వయంతో పని చేయడం అసాధ్యంగానే ఉంది. ఈ పొత్తులతో తమకు పెద్దగా లాభం లేదని కాంగ్రెస్.. తమకు టికెట్లు రావని టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీతో జత కడితే ప్రజల్లోకి ఎలా వెళ్తామంటూ కాంగ్రెస్ నాయకులే పేర్కొంటున్నారు.

303
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles