సమరానికి సిద్ధం

Sat,September 8, 2018 12:42 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : అసెంబ్లీ రద్దు అనంతరం మంత్రి జోగు రామన్న శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మంత్రి రాకకు ముందుగానే ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. జిల్లాకు చేరుకున్న మంత్రి జోగు రామన్న శాంతినగర్‌లో సాయిబాబా ఆలయంలో కుటుంబసభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డితో పాటు ఇతర నాయకులు, స్థానికులు ఆయనను సన్మానించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో చౌక ధరల దుకాణాల డీలర్లుకు కమీషన్ బకాయి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం పట్టణంలో పలు వాడల్లో స్పెషల్ డెవలప్‌మెంట్ నిధులతో నిర్మించే రోడ్డు పనులకు మంత్రి రామన్న భూమి పూజ చేశారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్, పత్తర్‌గట్టీ, కుమార్‌పేట్, శాంతినగర్, రాంమందిర్, బొక్కలగూడ, సుందరయ్యనగర్, కుర్షిద్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి జోగు రామన్నకు ప్రజలు నీరాజనాలు పలికారు. పలు వాడల్లో మహిళలు,

స్థానికులు మంగళ హారతులు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ డీలర్లకు కమీషన్ బకాయిలు రూ.6,74,62,576 సంబంధించిన చెక్కులను అందించారు. పలు వాడల్లో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి అభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అహర్నిషలు కష్టపడి నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దారన్నారు. పేద ప్రజలకు అండగా ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింట్లో ఆడపిల్లల పెళ్లికి రూ.1,00,116 అందజేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతోందన్నారు. కులవృత్తుల వారికి ప్రోత్సాహం, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాయితీ రుణాలను అందించారని చెప్పారు. రైతు బంధు పథకం కింద రైతులకు ఎకరాకు రూ.8వేల పెట్టుబడి సాయం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ప్రతి రైతుకూ రూ.ఐదు లక్షల బీమాను అందిస్తున్నామన్నారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న ప్రతిపక్షాలకు ప్రజలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చేబుతారని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనను కలవడానికి వచ్చిన వారితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి జోగు రామన్న బిజీగా గడిపారు.

ఆదిలాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఇంటి వద్ద ఉదయం నుంచి కోలాహలం నెలకుంది. బాపురావు ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండోసారి బోథ్ నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకున్న బాపురావు ఇంటికి నియోజకవర్గం నుంచి భారీగా సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పటాకులు పేల్చి సంబురాలు జరుపుకొన్నారు. పలువురు స్థానిక నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఆయనను సన్మానించారు.

260
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles