పోరాట స్ఫూర్తి చైతన్య దీప్తి

Tue,March 7, 2017 01:01 AM

ఆదిలాబాద్ రూరల్ : తాతలు, తండ్రుల కాలం నాటి భూముల హక్కుల కోసం సుమారు 15ఏళ్ల పాటు పోరాడి విజయం సాధించిన ఆదిలాబాద్ మండలంలోని పిప్పల్‌ధరి గ్రామ పంచాయతీ పరిధిలో గల దహిగూడ గ్రామానికి చెందిన కుమ్ర లక్ష్మీబాయికి రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సేవా విభాగంలో రాష్ట్ర అవార్డును ప్రకటించింది. దహిగూడ పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. సుమారు 30ఏళ్లకు ముందు ఈ గ్రామం ఏర్పడి అక్కడ కోలాం తెగకు చెందిన గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ అడవులను చదును చేసి తమ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయా పొలాలను వారు వ్యవసాయానికి అనుగుణంగా మార్చుకొని కొన్నేళ్ల పాటు సాగు చేసుకున్నారు.

కొందరు నాన్ ట్రైబల్స్ వీరి భూములను ఆక్రమించి తాము వ్యవసాయం చేసుకుంటున్న వీరిని కూలీలుగా మలిచారు. సుమారు 15ఏళ్ల క్రితం తమ తాతలు, తండ్రుల కష్టార్జితమైన భూములను తమకు ఇప్పించాలని కోరుతూ కుమ్ర లక్ష్మీబాయి కోర్టులో కేసు వేశారు. ఆ భూములు రెవెన్యూ రికార్డుల్లో వారి తాతలు, తండ్రుల పేర్లపైనే ఉండడంతో కోర్టు లక్ష్మీబాయికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇటీవలే రెవెన్యూ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆ భూములను ఆమెకు అప్పగించారు. ఇలా గ్రామంలో పలువురి భూములు వారికే దక్కడంలో ఆమె కీలక పాత్ర పోశించారు.

గ్రామస్తుల సమస్యలు తనవిగా..
గ్రామంలో ఉన్న సమస్యలను తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారం కోసం మండల స్థాయి అధికారులను కలిసి పరిస్థితి వివరించేది. గ్రామంలో ఏ వృద్ధుడికైనా పింఛన్, రేషన్ రాకపోయినా అధికారులను నిలదీసేది. ఎండాకాలంలో గ్రామంలో ఉన్న నీటి ఎద్దడి నివారణ కోసం ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను కలిసి, సమస్య పరిష్కరించేలా చూసేది.

గుడుంబాపై సమరం..
గిరిజన గ్రామం కావడంతో ఇక్కడ గుడుంబా తాగేవారు ఎక్కువగా ఉండేవారు. మూడేళ్లుగా చుట్టు ప్రక్కల గ్రామాల్లో గుడుంబాపై అలుపెరుగని పోరాటం చేసిందని స్థానికులు తెలిపారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేసేలా అధికారులకు సమాచారం అందించేది. గుడుంబా తాగడం వల్ల వచ్చే అనర్థాలపై వివరించి, అనేక మందిని గుడుంబా ముట్టుకోకుండా చేసింది.

ఒంటిచేత్తో కుటుంబ భారం..
ప్రజాసమస్యలు పరిష్కరించడంతో పాటు తన కుటుంబ భారాన్ని సైతం ఒంటిచేత్తో నిర్వహించింది. భర్త భీంరావ్ సుమారు 13ఏళ్ల క్రితం మరణించగా, కుటుంబ భారమంతా ఆమె పైనే పడింది. ఒక మగ పిల్లానితో పాటు, ముగ్గురు ఆడపిల్లలను పెంచడం కోసం ఎంతో కష్టపడింది. కుటుంబంతో పాటు గ్రామస్తుల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం సాగించేది. ఆమె సేవలను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సామాజిక రంగంలో ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు.

474
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles