మొదటి విడత పోలింగ్


Mon,January 21, 2019 11:31 PM

-111 స్థానాల్లో గెలుపు
-పంచాయతీ పోరులో ఏకగ్రీవానికితోడుగా విజయాల పరంపర
-జిల్లాలో తొలి విడతలో 88.27 శాతం పోలింగ్
-ఓటేసేందుకు ఉత్సాహం చూపిన గ్రామీణ ఓటర్లు
ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో సోమవారం జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్ల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఈ విడతలో ఆరు మండలాల్లో 103 గ్రామ పంచాయతీలు, 638 వార్డులకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. ఈ విడతలో 88.27 పోలింగ్ శాతం నమోదు కాగా.. తాంసి మండలంలో ఎక్కువగా 91.36 శాతం మంది, ఆదిలాబాద్ రూరల్ తక్కువగా 75.25 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే నాయకులను ఎన్నుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు. స్థానిక యువత, మహిళలతో పాటు వృద్ధులు సైతం ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. యువత హుషారుగా ఓటింగ్ పాల్గొన్నారు.


సందడిగా మారిన గ్రామాలు..
పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు తమ సొంత గ్రామాలకు వచ్చి ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఆ తర్వాత వేగం పుంజుకుంది. 9 గంటలకు 29 శాతం పోలింగ్ నమోదైంది. పలు కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. ఓపికగా క్యూలైన్ నిల్చొని తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేశారు. గ్రామాల్లో ఓటర్లు తమ కుటుంబసభ్యులతో కలిసివచ్చి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వీల్ అందుబాటులో ఉంచడమే కాకుండా సహాయకులను సైతం ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కావడంతో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తన సొంత గ్రామం జైనథ్ మండలం దీపాయిగూడలో ఓటు వేశారు.

పోలింగ్ ప్రశాంతం..
జిల్లాలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగాముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఆరు మండలాల్లోని 50 గ్రామ పంచాయతీలు, 592 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం 103 పంచాయతీలు, 638 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ అభ్యర్థులుగా 318 మంది, 638 వార్డు స్థానాలకు గానూ 1465 మంది బరిలో నిలిచారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 22 సర్పంచ్ స్థానాలకు 67 మంది అభ్యర్థులు, 159 వార్డులకు 349 మంది, మావల మండలంలో 3 సర్పంచ్ స్థానాలకు 18 మంది, 21 వార్డు స్థానాలకు 52 మంది, బేల మండలంలో 26 సర్పంచ్ స్థానాలకు 71 మంది, 127 వార్డు స్థానాలకు 280 మంది, జైనథ్ 36 సర్పంచ్ స్థానాలకు గానూ 96 మంది, 219 వార్డులకు 479 మంది, తాంసిలో 6 సర్పంచ్ స్థానాలకు 24 మంది, 45 వార్డులకు 110 మంది, భీంపూర్ మండలంలో 11 సర్పంచ్ 44 మంది, 67 వార్డులకు 195 పోటీ పడ్డారు.

తాంసిలో ఎక్కువ..ఆదిలాబాద్ రూరల్ తక్కువ..
మొదటి విడత ఎన్నికలు జరిగిన ఆరు మండలాల్లో 88.27 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విడతలో 99,665 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా.. 87,973 మంది ఓటు వేశారు. వీరిలో 43,792 మంది పురుషులు, 44,181 మంది మహిళలున్నారు. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా వేగం పుంజుకుంది. ఉదయం 9 గంటల వరకు 29 శాతం, 11 గంటలకు 65.83 శాతం నమోదు కాగా.. పోలింగ్ ముగిసే సమయానికి 88.27 శాతం పోలింగ్ నమోదైంది. తాంసి మండలంలో ఎక్కువగా 91.36 శాతం, తక్కువగా ఆదిలాబాద్ రూరల్ మండలంలో 75.25 శాతం రికార్డయింది. మావలలో 88.43 శాతం, బేలలో 86.53 శాతం, జైనథ్ 87.82 శాతం, భీంపూర్ 88.76 శాతం పోలింగ్ నమోదైంది.

338
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles