ప్రమాదాలకు అడ్డుకట్ట

Sun,January 20, 2019 11:46 PM

నిర్మల్ క్రైం : నిర్మల్ జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై జిల్లా పోలీసులు కొరఢా ఝళిపించారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై కేసులను నమోదు చేస్తున్నారు. వాహనదారులు అతివేగంగా వాహనాలను నడుపు తూ రోడ్డు నిబంధనలు పాటించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను జంప్‌చేసి వెళ్లడం, అనుమతి లేనిచోట్ల వాహనాలను పార్కింగ్‌చేస్తూ తోటి వా హనదారులకు ఇబ్బంది కలిగించిన పలువురి వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై జరిమానాలను విధించి ప్రమదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారు. 2017తో పోల్చితే 2018సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా తగ్గందనే చెప్పొచ్చు. రోజురోజుకూ వాహన నిబంధనలు కఠినతరం కావడం, నిత్యం ఏదో ఒక చోట పోలీసులు వాహనాలను తనిఖీ చేయడంతో వాహనదారుల్లో రోడ్డు నిబంధనలపై అవగాహన పెరిగిపోతోంది. జిల్లాలో తొలిసారిగా ఈ-చలాన్ విధానాన్ని ఎస్పీ శశిధర్ రాజు హైదరాబాద్ తరహాలో అమలుపర్చారు. దీంతో వాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు నిబంధనలు పాటిస్తుండడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది.

జిల్లాలో 33,764 కేసుల నమోదు..
జిల్లా కేంద్రంతో పాటు భైంసా, బాసర, ఖానాపూర్ పట్టణాలతో పాటు 19 మండలాల్లో పోలీసులు నిర్వహించిన స్పెషల్ డైవ్ వాహనాల తనిఖీల్లో 2018లో 33, 764 కేసులు నమోదు కాగా.. 2017లో 56,209 కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే ఎంవీ యాక్టు కేసుల సంఖ్య తగ్గిందని చెప్పొచ్చు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో జిల్లా ఖాజానాకు 2018 సంవత్సరంలో రూ.49,73,150 చేకూరగా.. 2017 సంవత్సరంలో రూ.64,53,222 నగదు సమకూరింది. 2017తో పోల్చినట్టయితే కేసులతో పాటు ఆదాయం కూడా తగ్గింది.

తగ్గిన రోడ్డు ప్రమాదాలు..
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న విస్తృత తనిఖీలు రోడ్డు ప్రమాదాలు అడ్డుకట్ట వేయలేకపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనదారులు నిబంధనలు పాటించాలని పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోతోంది. రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని, ఈ ప్రమాదాల్లో అనేకమంది మృత్యువాతపడు తూ కుటుంబసభ్యులకు, తోటి ప్రయాణికులకు ఇబ్బందుల కు గురి చేస్తున్నారు. 2018 సంవత్సరంలో 245 కేసులు నమోదయ్యాయి. వీటిలో 90 మంది మృతి చెందగా.. 155 మంది గాయపడ్డారు. 2017తో పోలిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది. 2017లో 327 కేసులు నమోదు కాగా.. 91 మంది మృతి చెందారు. 236 మంది గాయపడ్డారు. 2016లో జిల్లాలో దాదాపు 490 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా.. 87 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 403 మంది గాయాలతో బయటపడ్డారు. 2015లో 543 రోడ్డు ప్రమాదాలు జరుగగా.. 110 మంది మృత్యువాతపడ్డారు. 433 మంది గాయాలపాలయ్యారు.

వాహనదారుల్లో గుబులు..
ట్రాఫిక్ పోలీసులు నిత్యం వాహనాలను తనిఖీ చేయడంతో వాహనదారుల్లో గుబులు రేగుతోంది. డ్రైవింగ్ లైసెన్సులు లేకపోవడంతో నిత్యం జరిమానాలను కట్టడంతో వా హనదారుల జేబులకు చిల్లులుపడుతున్నాయి. దీంతో జరిమానాలకు పెట్టే నగదుతో లైసెన్సులను తీసుకొనేందుకు వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. దీంతో నిత్యం వం దల సంఖ్యలో లైసెన్స్‌లకు దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. వాహనదారులతో కార్యాలయం కిటకిటలాడుతుంది.

ఎంవీ యాక్టు నిబంధనలివీ..
- డ్రైవింగ్ లైసెన్సు లేని వ్యక్తికి వాహనం ఇవ్వరాదు. ఇస్తే వాహన యజమానికి రూ.1000 జరిమానా లేదా సెక్షన్ 180 ప్రకారం మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు.
- వాహనదారుడికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు ఉండా లి. లేకుంటే రూ.500 జరిమానా, సెక్షన్ 181 ప్రకారం మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు.
- పోలీసు ఉత్తర్వులు పాటించని వారికి, సమాచారం ఇచ్చేందుకు నిరాకరించిన వారికి సెక్షన్ 179 ప్రకారం రూ.500 జరిమానా విధిస్తారు.
- వాహనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. లేకుండా నడిపితే వాహనాన్ని స్వాధీనపరుచుకుంటారు. సెక్షన్ 192 ప్రకారం రూ.2వేల నుంచి రూ.5వేల వరకు జరిమానా వేస్తారు.
- బీమా లేకుండా వాహనం నడిపితే చట్టరీత్యానేరం. అలా నడిపిన వారికి సెక్షన్ 196 ప్రకారం రూ.1000 జరిమానా, మూడు నెలల జైలు లేదా రెండు శిక్షలు విధించవచ్చు.
- మద్యం తాగి వాహనం నడపడం క్షమించరాని నేరం. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే అరెస్టు చేస్తారు. సెక్షన్ 185 ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధిస్తారు.

- సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం చట్టరీత్యా నేరం. అలా వాహనం నడిపితే సెక్షన్ 184 ప్రకారం రూ.1000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష. - ప్రమాదకరమైన డ్రైవింగ్, జంపింగ్ సిగ్నల్స్ చేస్తే రూ.1000 జరిమానా విధిస్తారు.
- ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. లేకుంటే సెక్షన్ 177 ప్రకారం రూ.100 జరిమానా వేస్తారు.
- ద్విచక్రవాహనంపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. ముగ్గురు ప్రయాణిస్తే ప్రమాదకరం. అలా ప్రయాణించిన వారికి సెక్షన్ 128,177,184 ప్రకారం రూ.500 జరిమానా విధిస్తారు.
- వాహనాలను రోడ్లపై ఎక్కడంటే అక్కడ నిలుపరాదు. అలా నిలిపితే 122 సెక్షన్ ప్రకారం రూ.200 అపరాధ రుసుం వసూలు చేస్తారు.
- ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదు. నిబంధనలు అతిక్రమిస్తే ఆటోను స్వాధీనపరుచుకుంటారు. సెక్షన్ 32(111)177 ప్రకారం డ్రైవరుకు రూ.2 వేలు అపరాధం, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు.

డ్రైవరు పక్కన ప్రయాణికులు కూర్చొని ప్రయాణించరాదు. అలా చేస్తే సెక్షన్ 125 ప్రకారం డ్రైవరుకు రూ.100 అపరాధం విధిస్తారు.
గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తరలించరాదు. అలా ప్రయాణిస్తే సెక్షన్ 252 ప్రకారం వాహన డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తారు.
గూడ్స్ వాహనాల్లో పరిమితికి మించి సరుకులు రవాణా చేయకూడదు. ఒక వేళ చేస్తే సెక్షన్ 194 ప్రకారం రూ.3 వేలు జరిమానా విధిస్తారు.
వాహన దారులు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి. లేకుంటే సెక్షన్ 138(3) ప్రకారం రూ.100 జరిమానా విధిస్తారు.
ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ సిగ్నల్స్, డివైడర్స్ బోర్డులను చెరిపేసినా, గోడ పత్రాలు అతికించినా సెక్షన్ 119 ప్రకారం రూ.200 అపరాధం వసూలు చేస్తారు.
వాహన నంబర్ ప్లేటుపై నంబర్ తప్ప ఎలాంటి రాతలు ఉండకూడదు. నంబరు ప్లేటుపై ఫ్యాన్సీ నంబర్లు ఉంటే సెక్షన్ 177 ప్రకారం రూ.100 జరిమానా వేస్తారు.

300
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles