ఎన్నికలకు మూడంచెల భద్రత

Sat,January 19, 2019 12:00 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మూడంచెల భద్రతతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ విష్ణువారియర్ తెలిపారు. పట్టణంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న పోలీసు సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తుపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కల్పించడానికి కృషి చేస్తున్నారని, నాటి కృషి నేటి ఎన్నికల సమయంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజలతో సత్సంబంధాలు నెలకొలనడంతో భద్రతాపరమైన చర్యల్లో రాణించాలని తెలిపారు. పల్లె ప్రజలు ఆవేశాలకు లోనుకావొద్దని, ఏ సమస్యలు తలెత్తినా పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

ప్రతి గ్రామంలో నిఘా పోలీసులు డేగ కన్నుతో ప్రజల రక్షణకు భంగం కలగకుండా బందోబస్తు నిర్వహిస్తారన్నారు. ఎన్నికల నియమావళి, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు తమ విధులను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఇద్దరితో పోలీస్ బందోబస్తు ఉంటుందని, సమస్యాత్మక కేంద్రాల్లో సాయుధ పోలీసులతో పాటు ఎస్సై, ఏఎస్సై స్థాయి సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన అనుభవంతో పంచాయతీ ఎన్నికలను సాఫీగా కొనసాగించడానికి జిల్లా పోలీసులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో మావోయిస్టుల ప్రభావం ఉండబోదని, కానీ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు కొనసాగించాలన్నారు.

పలువురికి రివార్డులు..
విధుల్లో చురుకుగా వ్యవహరించి గుర్తింపు పొందిన పది మంది పోలీసు అధికారులకు ఎస్పీ విష్ణువారియర్ నగదు రివార్డులు అందించారు. ప్రతి నెలా విధి నిర్వహణలో గుర్తింపు పొందిన పలువురు అధికారులను పోలీసు సమీక్షా సమావేశంలో నగదు రివార్డు అందిస్తూ అభినందిస్తున్నారు. పని విధానాన్ని గుర్తించడంతో పోలీసులు మరింత శ్రమించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని ఎస్పీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సమావేశంలో అదనపు ఎస్పీ కంచ మోహన్, డీఎస్పీలు కె.నర్సింహారెడ్డి, ఎన్.వెంకటేశ్, ఎల్‌సి నాయక్, జి. కిషన్ సింగ్, సీఐలు యు.వెంకన్న, వి.సురేశ్, కె.నాగరాజు, ట్రాఫిక్ సీఐ జవాజీ సురేశ్, ఎస్.సతీశ్ కుమార్, కె.లక్ష్మీనారాయణ, సీహెచ్.హనూక్, జయరాం, ఎస్సైలు అన్వర్ ఉల్‌హక్, ఎస్.వెంకన్న ప్రభాకర్, జి. హరిశేఖర్, పోలీసు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, క్యాంపు కార్యనిర్వహణాధికారి దుర్గం శ్రీనివాస్, పోలీసు కార్యాలయం ఏవో అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

131
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles