బోథ్, నమస్తే తెలంగాణ: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారి అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభం అయ్యేలా చూడాలని ఎంపీ గొడం నగేశ్ జాతీయ రహదారుల విభాగం రీజినల్ అధికారి కృష్ణప్రసాద్‌ను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్హెచ్ఏఐ రీజినల్ కార్యాలయంలో ఆర్వోను ఆయన కలిశారు. ఉమ్మడి జిల్లాలోని సోన్ నుంచి జైనథ్ మండలం మహారాష్ట్ర సరిహద్దు వరకు అవసరమైన చోట్ల సర్వీసు రోడ్లు, స్లిప్ రోడ్లు, బస్ బేలు, గుడిహత్నూర్, సోన్ వద్ద అండర్‌పాస్ నిర్మాణం కోసం నిధులు మంజూరైనా పనులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. కేఎన్ఆర్, సోమా కన్స్ట్రక్షన్ కంపెనీల వారు సాంకేతిక అనుమతులు, ప్రతిపాదనల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆర్వో దృష్టికి తీసుకెళ్లారు. వీటి నిర్మాణాలు పూర్తికాక పోవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. స్పందించిన ఆర్వో వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ చెప్పారు.