సర్పంచ్‌లకు వేతన కబురు


Wed,August 21, 2019 03:49 AM

-పాత వారికి బకాయిలు, కొత్త వారికి జీతాలు విడుదల
-రూ.53.30లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం
-త్వరలోనే పంచాయతీ ఖాతాల్లోకి డబ్బులు
-ఆనందం వ్యక్తం చేస్తున్న సర్పంచ్‌లు
అర్బన్ కలెక్టరేట్, ఆగస్టు 20: పాత, కొత్త సర్పంచులకు రాష్ట్ర సర్కారు తీపు కబురు పంపిం ది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాత సర్పంచుల గౌరవ వేతన బకాయిలు, కొత్త వారి వేతనాలు మంజూరు చేసింది. పాత వారికి సంబంధించి నాలుగు నెలల బకాయిలు రూ.20. 80 లక్షలు, కొత్తవారికి ఐదు నెలల వేతనం రూ.32.50లక్షలు విడుదల చేసింది. త్వరలోనే ఆయా గ్రామ పంచాయతీల అకౌంట్లలో నిధులు జమ కానున్నాయని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. కాగా పంచాయతీ ఎన్నికల ముందు వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో 104 పంచాయతీలుండేవి. వీటికి అదనంగా మరో 26 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయగా జిల్లాలో పంచాయతీల సంఖ్య 130కి పెరిగింది. అయితే జిల్లాలోని ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి పంచాయతీ పాలక వర్గం గడువు ముగియకపోవడంతో కేవలం 129 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వం వేతనాలు విడుదల చేయడంతో సర్పంచ్‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రూ.5వేలకు పెంపు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్పంచ్‌ల వేతనాలు పెంచింది. గతంలో సర్పంచ్‌లకు రూ.600 నుంచి రూ.1500 వరకు (మైనర్, మేజర్ గ్రామ పంచాయతీల ఆధారంగా) గౌరవ వేతనంగా అందజేసేవారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నిధుల నుంచి మరో 50 శాతం కలిపి ఇచ్చేవారు. గత ప్రభుత్వాలు ఈ చిన్న మొత్తం కూడా నెలలు సంవత్సరాల పాటు విడుదల చేయని సందర్భాలున్నాయని పలువురు సర్పంచులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి తేడా లేకుండా అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు నెలకు రూ.5వేల వేతనం అందజేస్తోంది. సర్కారు పెంచిన వేతనాలు వెంట వెంటనే మంజూరీ చేస్తుందని సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో జీపీల ఖాతాల్లో జమ
గ్రామ పంచాయతీల సర్పంచుల వేతనాలు నిధులను సర్కారు విడదల చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లులను జిల్లా పంచాయతీ అధికారులు సంబంధిత ట్రెజరీ కార్యాలయాలకు పంపించారు. రెండుమూడు రోజుల్లో వేతన నిధులు ఆయా ఖాతాల్లో జమకానున్నాయి. పంచాయతీల ఖాతా నుంచి సంబంధిత పంచాయతీ కార్యదర్శి నిధులు విత్ డ్రా చేసి పాత సర్పంచ్‌లకు సంబంధించి 4 నెలల వేతనం, కొత్త సర్పంచ్‌లకు సంబంధించి ఐదు నెలల వేతనం నెలకు రూ.5వేల చొప్పున అందజేయనున్నారు. ఇందుకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో అక్విటెన్స్ రిజిస్టర్‌కు ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో పాత, కొత్త సర్పంచ్‌లకు సంబంధించి మొత్తం రూ.53.30లక్షలు నిధులు మంజూరయ్యాయి. వీటిలో 104 మంది పాత సర్పంచ్‌లకు సంబంధించి (ఒక్కొక్కరికి నెలకు రూ.5వేల చొప్పున) రూ.20,80,000, 130 మంది కొత్త సర్పంచ్‌లకు (పాత జీపీలు 104, కొత్తవి 26కలిపి ) రూ.32,50,000లు నిధులు విడుదల చేశారు.

ట్రెజరీల వారీగా వివరాలు
పాత, కొత్త సర్పంచ్‌ల కోసం విడుదల చేసిన వేతనాల బిల్లులను సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాలకు పంపించినట్లు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. వీటి ప్రకారం వరంగల్ అర్బన్ ట్రెజరీ కార్యాలయానికి ధర్మసాగర్, వేలేరు, హసన్‌పర్తి, కమలాపూర్ మండలాల సర్పంచ్‌లకు సంబంధించి రూ.29,60,000, వరంగల్ ఈస్ట్ ఎస్‌టీవో కార్యాలయానికి ఐనవోలు మండల పరిధిలోని సర్పంచ్‌లకు రూ.7,25,000, భీమదేవరపల్లి ఎస్‌టీవో కార్యాలయానికి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండల పరిధిలోని సర్పంచ్‌లకు రూ.16,45,000 బిల్లులు పంపించారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...