క్రియాశీల గులాబీ..


Mon,July 15, 2019 02:59 AM

-టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి అనూహ్య స్పందన
-ముందుకొస్తున్న అన్ని వర్గాలు
-పండుగ వాతావరణంలో నమోదు
-ఏ రోజుకారోజే ఆన్‌లైన్‌
-మంత్రి ఎర్రబెల్లి, నియోజకవర్గ బాధ్యుల నిరంతర పర్యవేక్షణ
వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: పార్టీ సభ్యత్వాలు.. అంటే మాకెందుకు అనే రోజుల నుంచి మాకెందుకు సభ్యత్వాలియ్యరు..అనే దాకా వెళ్లిపోయింది. రాజకీయ పార్టీల్లో సభ్యత్వం తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపని వర్గాలన్నీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ సభ్యత్వాల కోసం క్యూ కడుతున్నాయి. సహజంగా రాజకీయ పార్టీల సభ్యత్యాలు అంటే ఓటర్ల జాబితా ముందేసుకునో లేదా గ్రామ, డివిజన్‌ స్థాయి పార్టీ కార్యకర్తలు తమకు తోచిన పేర్లేవో రాసి సభ్యత్వ తతంగాన్ని ముగిస్తారు. కానీ తమ పార్టీ అలా చేయదని, పక్కాగా చేసి చూపిస్తామని టీఆర్‌ఎస్‌ నిరూపిస్తూ చూపిస్తున్నది అని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వారం పది రోజులుగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. వరంగల్‌ తూర్పు,పశ్చిమ ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీ సభ్యత్వాలను దగ్గరుండీ నియోజకవర్గాల్లోని డివిజన్లు, బూత్‌ల వారీగా నాయకుల్ని, కార్యకర్తల్ని బాధ్యులుగా నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ సభ్యత్వం అంటే డివిజన్‌ నాయకుడో, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేనో ఏదో సభ్యత్వ రుసుం కట్టి ఈ కార్యక్రమం పూర్తయిందని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కానీ టీఆర్‌ఎస్‌ మాత్రం తమది ఆ సంస్కృతి కాదని పేర్కొంటున్నారు.

నిరంతర పర్యవేక్షణ
టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఊరువాడ పండుగలా సాగుతున్నాయి. గులాబీ సభ్యత్వం తీసుకోవడం తమకు అత్యంత ఇష్టమైన పనిగా కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ నిర్దేశించిన ప్రకారం క్రియాశీల సభ్యత్వాలు, సాధారణ సభ్యత్వానికి ఎవరికి వారుగా రుసుం చెల్లించి మరీ సభ్యత్వం తీసుకుంటున్నారు. గతంలో తీసుకున్న కార్యకర్తలు, నాయకుల కంటే ఈసారి కొత్తగా సభ్యత్వాలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పార్టీ పరిశీలకులు పేర్కొంటున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యవేక్షణ ఒకవైపు, మరోవైపు నియోజకవర్గాలకు అక్కడి నుంచి డివిజన్‌ స్థాయి వరకు బాధ్యుల్ని నియమించి వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నది.

ఆన్‌లైన్‌ అప్‌డేషన్‌
క్రియాశీల సభ్యత్వం, సాధారణ సభ్యత్వం ఈ రెండు వేటికవే డివిజన్‌ స్థాయిలో తీసుకుంటున్న ఏ రోజుకారోజు పార్టీ కేంద్ర కార్యాలయానికి సభ్యత్వ వివరాలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గానికి ప్రత్యేక డేటా ఎంట్రి పాయింట్లను ఎంపిక చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి సమగ్ర సమాచారాన్ని అప్‌లోడ్‌ చేస్తున్నారు. నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వాలు చేయాలని భావిస్తే ఇప్పటికే వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ ఈ రెండు నియోజకవర్గాల్లో 70వేల సభ్యత్వాలు పూర్తి చేశారు. ఇందులో దాదాపు 22,500 క్రియాశీల సభ్యత్వాలు పూర్తయ్యాయి.

గులాబీ సైనికులు కావాలనే...
పార్టీ సభ్యత్వ కార్యక్రమం స్వచ్ఛందంగా సాగుతున్నది. విద్యార్థులు, యువకులు సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావడం సంతోషంగా ఉంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది ఉత్సాహం చూపిస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన తొలి రోజే హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే యువతి వచ్చి తాను టీఆర్‌ఎస్‌ సభ్య త్వం తీసుకునేందుకు ఇక్కడికి వచ్చానని పేర్కొనడం చాలా సంతోషాన్నిచ్చింది. అదేవిధంగా రిటైర్డ్‌ ఉద్యోగులు ఈసారి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. కార్మిక, కర్షక వర్గాలు, బస్తీల్లో ఉండే సంఘటిత, అసంఘటిత వర్గాలు పెద్ద సంఖ్యలో ముందుకువస్తున్నారు.
-దాస్యం వినయభాస్కర్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే

అన్ని వర్గాలు ఆసక్తిగా
పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీ సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సభ్యత్వ కార్యక్రమం కనుక యువత ఎక్కువగా ముందుకొచ్చి సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారు. హమాలీ కార్మికుల నుంచి మొదలుపెడితే గుమాస్తాలు, వ్యాపారులు ఇలా ఒక్కరేమిటీ అన్ని వర్గాలు పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకొస్తున్నాయి.
-నన్నపునేని నరేందర్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే

తెలంగాణ భవన్‌కు అనుసంధానం
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతున్నది. నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో జరిగిన సభ్యత్వాలు ఏ రోజుకారోజుకు పార్టీ కేంద్ర కార్యాలయానికి అప్‌లోడ్‌ అవుతున్నాయి. క్రియాశీల సభ్వత్వం కానీ, సాధారణ సభ్యత్వం కానీ ఎవరు సభ్యత్వం తీసుకున్నా.. వారి పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే కార్యక్రమం ఎక్కడిక్కడ జరుగుతుంది.
- కే వాసుదేవరెడ్డి, చైర్మన్‌, దివ్యాంగుల అభివృద్ధి సహకార సంస్థ

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...