అయ్యో పాపం సుగుణమ్మ..


Sat,July 13, 2019 01:50 AM

వర్ధన్నపేట, నమస్తే తెలగాణ, జూలై 12 : ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. 50 ఎకరాల భూమి ఉన్న ఆ కుటుంబం నలుగురు కుమార్తెలను ఉన్నత కుటుంబాలకు ఇచ్చి వివాహాలు జరిపించింది. కొడుకుకు పెద్ద బిడ్డ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. కానీ, కాలం పగబట్టినట్లుగా భర్త అకాల మరణం చెందాడు. మూడేళ్లకే కొడుకు కూడా చనిపోయాడు. దీంతో వృద్ధురాలైన ఆ తల్లి కుమార్తెల ఇళ్ల వద్దకు వెళ్లింది. కానీ, కుమార్తెలు తల్లిని ఏమాత్రం పట్టించుకోకపోగా నానా ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించారు. ఉన్న ఆస్తిని నలుగురు కుమార్తెలు పంచుకున్నారు. తన వద్ద ఉన్న వద్ద రూ.4 లక్షలను బావ కుమారుల సాయంతో ఆమె బ్యాంకులో వేయించుకున్నది. ఈ డబ్బులు కూడా ఇవ్వాలని నానా ఇబ్బందులకు గురిచేస్తూ పెద్ద కూతురు గురువారం రాత్రి దివిటిపల్లి గ్రామంలో వదిలి వెళ్లిపోయింది. వర్షంలో తడుస్తున్న వృద్ధురాలిని గ్రామ సర్పంచ్ బుంగ లత గ్రామ పంచాయతీలో ఆశ్రయం ఇచ్చి శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. వృద్ధురాలిని ఏమైందమ్మా అని అడిగితే బోరున విలపిస్తూ తన కష్టాన్ని ఏకరువు పెట్టింది. మండలంలోని దివిటిపల్లి గ్రామానికి చెందిన ఏడుదొడ్ల యాదవరెడ్డి, సుగుణమ్మ(72) దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. నలుగురు కూతర్లను ఉన్నత కుటుంబాలకు ఇచ్చి వివాహాలు జరిపించడంతో పాటుగా తనకున్న 50 ఎకరాల భూమిని నలుగురు కూతుర్లకు కట్నకానుకల కింద ఇచ్చారు. యాదవరెడ్డి సుమారు 15 ఏళ్ల క్రితం మృతి చెందగా.. కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందాడు.

దీంతో వృద్ధురాలైన సుగుణమ్మ నలుగురు కూతుర్ల ఇళ్లకు వెళుతూ నెల రోజుల చొప్పున ఉంటున్నది. హన్మకొండలో పెద్ద కూతురు సుగుణమ్మను నిత్యం కొడుతూ తిండి కూడా సరిగా పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నది. ఈక్రమంలోనే నెల రోజుల క్రితం కింద పడడంతో కాలు విరిగింది. సుగుణమ్మ ఇల్లు గతంలోనే కూలిపోయి ఉన్నది. సిమెంట్ పట్టితో నడవలేకుండా ఉన్న వృద్ధురాలిని పెద్ద కూతురు గురువారం రాత్రి దివిటిపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద వదిలేసి వెల్లిపోయింది. వృద్ధురాలిని గుర్తించిన గ్రామస్తులు రాత్రి గ్రామపంచాయతీలో ఆశ్రయం ఇచ్చి శుక్రవారం వర్ధన్నపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. వృద్ధురాలిని ఏమైందమ్మా అన్ని ప్రశ్నిస్తే కన్నీటి పర్యంతమవుతూ తన కష్టాలను ఏకరువు పెట్టింది. నిత్యం కూతురు కొడుతూ తిండికూడా పెట్టడంలేదని వాపోయింది. కాలు విరిగి ఉన్న తనను గురువారం రాత్రి దివిటిపల్లి బస్టాండ్ వద్ద వదిలి వెళ్లిపోయిందని బోరున విలపించింది. చివరగా మిగిలిన భూమి అమ్మితే వచ్చిన రూ.4 లక్షలను మా బావ కొడుకు పేరు, నాపేరుతో బ్యాంకులో జమ చేసుకోవడం జరిగిందని వృద్ధురాలు తెలిపింది. ఈ మొత్తాన్ని కూడా తనకు ఇవ్వాలని పెద్ద కూతురు ఇబ్బంది పెడుతున్నదని చెప్పింది. కాగా, ఎస్సై సంపత్ వృద్ధురాలు సుగుణమ్మ విషయాన్ని హన్మకొండలోని సహృదయ వృద్ధాశ్రమ నిర్వాహకులు చోటూకు సమాచారం ఇచ్చారు. ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబీ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సుగుణమ్మను వృద్ధాశ్రమానికి తీసుకువెళ్లింది.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...