పేదల కోసమే గురుకులాలు


Tue,June 18, 2019 02:39 AM

అర్బన్ కలెక్టరేట్, జూన్ 17: విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ సర్కారు నిరుపేద విద్యార్థుల కోసం మరో వరం ప్రకటించింది. నియోజకవర్గానికి గురుకులం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 119 గురుకులాలను ఈవిద్యా సంవత్సరం నుంచే ప్రారంభించింది. ఈ మేరకు సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, డీఈవో కొత్తగా మంజూరు చేసిన గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో 17 గురుకుల పాఠశాలలున్నాయి. తాజాగా 12 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ క్రమంలో వరంగల్ అర్బన్ జిల్లాకు రెండు బాలికలు, ఒక బాలుర గురుకుల పాఠశాలలను కేటాయించింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని మామూనూర్‌లో ఏర్పాటు చేసిన బాలుర పాఠశాలను పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని కాజీపేట సోమిడిలో ఏర్పాటు చేసిన బాలికల గురుకుల పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి ప్రారంభించారు. నిరుపేద బీసీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నారని అతిథులు పేర్కొన్నారు.

5,6,7వ తరగతిలో ప్రవేశాలు
కొత్తగా సోమవారం ప్రారంభించిన బీసీ గురుకుల పాఠశాలల్లో 5,6,7వ తరగతిలో ప్రవేశాలు కల్పించారు. ఇంగ్లిష్ మీడియంలో తరగతులను బోధిస్తారు. ఇందుకు కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్‌తో పాటు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేశారు. ఒక్కొక్క తరగతిలో 40 మంది చొప్పున రెండు సెక్షన్లు కలిపి మూడు తరగతుల్లో మొత్తం 240 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. మొదటి దశకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇచ్చిన గడువులోగా మొదటి దశలో ఎంపిక విద్యార్థులు చేరకపోతే తర్వాత మెరిట్ ఉండి రిజర్వు జాబితాలో ఎంపిక చేసిన విద్యార్థులకు రెండో దశలో అడ్మిషన్లు కల్పించనున్నారు. అర్బన్ జిల్లాకు మంజూరైన మూడు గురుకుల పాఠశాలల వల్ల మరో 240 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

గురుకులాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్, స్పోర్ట్స్ డ్రెస్, ట్రాక్‌సూట్, రెండు జతల షూ, బెడ్‌షీట్, కార్పెట్, టవల్స్, ప్లేట్లు, గ్లాసులు, పుస్తకాలు, నోట్‌బుక్స్, స్టేషనరీ, కాస్మోటిక్ కిట్స్ అందిస్తున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకు శిక్షణ పొందిన నిష్ణాతులైన ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. విద్యార్థులకు డిజిటల్ తరహాలో బోధన, ప్రత్యేక తరగతుల నిర్వహణ, పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు తరగతుల నిర్వహణ (మధ్యలో స్నాక్స్), 1.30కు భోజనం, 2 గంటల నుంచి 4.30 వరకు స్టడీ అవర్, 4.30 నుంచి 5.30వరకు క్రీడలు తర్వాత స్నాక్స్ ఇస్తారు. అలాగే సాయం త్రం 6.30 గంటల వరకు మళ్లీ స్టడీ అవర్స్ నిర్వహిస్తారు.

పకడ్బందీ మెనూ..
రాష్ట్ర సర్కారు ప్రారంభించిన బీసీ గురుకుల పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా మెనూను అమలు చేస్తున్నారు. ఉదయం పాలల్లో రాగి పౌడర్ లేదా బూస్ట్ కలిపి అందజేస్తారు. ఉదయం అల్పహారంలో వారం రోజుల్లో రోజుకు ఒకటి చొప్పున (ఉప్మా, కిచిడి, జీరా రైస్, పులిహోర, పూరి, బోండా, ఇడ్లి) అందిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం భోజనంలో భాగంగా కూరగాయలతో కూర, పప్పు, సాంబారు, పెరుగు, సాయంత్రం స్నాక్స్‌లో సేమియా, బబ్బెర్లు, పెసరు గుడాలు లేదా బిస్కెట్లు అందజేస్తారు. రాత్రి భోజనంలో భాగంగా కూరగాయలు, రసం, మజ్జిగ, పప్పు, సీజనల్ పండ్లు ప్రతి రోజూ అందజేస్తారు. అలాగే వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు, నెలలో నాలుగు వారాలు చికెన్, రెండు వారాలు మటన్‌తో భోజనం పెడుతారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...