ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్


Tue,June 18, 2019 02:37 AM

-ఇబ్బందులుపడిన రోగులు
-ప్లకార్డులు, గాయాలకట్టుతో వైద్యుల ప్రదర్శన
రెడ్డికాలనీ, జూన్ 17: వైద్యో నారాయణ హరి.. వైద్యుడు ప్రాణంపోసే దేవుడితో సమానమంటారు.. అలాంటి వైద్యులపై, ఆస్పత్రులపై దాడులను అరికట్టాలని ప్రైవేటు హాస్పిటల్స్ బంద్ పాటించాయి. నిత్యం రోగులతో రద్దీగా ఉండే దవాఖానలు ఒక్కసారిగా బోసిపోయాయి. హాస్పిటల్స్‌లోని ఓపీలకు సోమవారం ఫుల్‌స్టాఫ్ పెట్టారు. ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు స్టెత్ డౌన్ చేశారు. వైద్యులు, హాస్పిటల్స్‌పై జరుగుతున్న దాడులకు నిరసనగా దేశవ్యాప్త హాస్పిటల్స్ బంద్‌లో భాగంగా వైద్యులు ఆస్పత్రులను మూసివేసి స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లీనిక్స్, హాస్పిటల్స్, డయాగ్నస్టిక్స్ సెంటర్ల సర్వీస్‌లు బంద్ చేసి నిరసన తెలిపారు. ప్రతిరోజూ వందల మందితో హడావుడిగా ఉండే హన్మకొండ కాకాజీకాలనీ, విజయ టాకీస్ రోడ్‌లోని హాస్పిటల్స్ బంద్‌తో ఖర్ఫ్యూను తలపించింది. నగరంలోని ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్స్‌లో అత్యవసర వైద్య సేవలు మినహా ఓపీలు బంద్ చేశారు.

హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ హాస్పిటల్‌లో వైద్యులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. మ్యాక్స్‌కేర్ ఎండీ, ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు జీ రమేశ్ ఆధ్వర్యంలో హన్మకొండ కిషన్‌పురలోని అమృత హాస్పిటల్ ఎదుట ప్లకార్డులతో, తలకు, చేతులకు గాయాలపట్టిలు కట్టుకుని ప్రదర్శన చేపట్టారు. వైద్యులను, కాపాడాలని, దాడులను అరికట్టాలని ప్లకార్డుల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త హాస్పిటల్స్ బంద్‌లో భాగంగా 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు సమ్మెలో పాల్గొననున్నారు. హాస్పిటల్స్‌తో పాటు మెడికల్ షాపులు సైతం మూతపడ్డాయి. దీంతో సోమవారం ఒక్కరోజు లక్షల రూపాయలు నష్టపోయారు.

వెలవెలబోయిన దవాఖానలు
ప్రైవేట్ ఆస్పత్రుల బంద్ సోమవారం ప్రశాంతంగా కొనసాగింది. వైద్యులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కాకాజీకాలనీ నిర్మానుష్యంగా కనిపించింది. ఆ కాలనీలోని హాస్పిటల్స్, మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ప్రభుత్వ ఆస్పత్రులు మినహా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ మూతబడ్డాయి.

ఇబ్బందులుపడిన రోగులు
హాస్పిటల్స్‌ను మూసివేసి ఓపీలు బంద్ చేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సెలవు దినం, సోమవారం కూడా ప్రైవేటు ఆస్పత్రులు బంద్ చేయడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు అయోమయానికి గురయ్యారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు జ్వరం రావడంతో దగ్గరలోని మెడికల్ షాపుల్లో టానిక్‌లు ఉపయోగపడ్డాయి. అత్యవసర వైద్య సేవలు బంద్ నుంచి మినహాయించారు. 24 గంటల బంద్ పిలుపులో భాగంగా నేడు ఉదయం ఆస్పత్రులు తెరుచుకోనున్నాయి.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...