భూ మాఫియాపై ఉక్కుపాదం


Sun,June 16, 2019 03:34 AM

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: భూ మాఫియాపై సర్కార్‌ సీరియస్‌ ఫోకస్‌ చేసింది. విస్తరిస్తున్న మహానగరం చుట్టుపక్కల అమాయకుల భూములను తమ ఇష్టారీతిగా కాజేయాలని చూస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సర్కార్‌ భావిస్తున్నది. అక్రమంగా వెలుస్తున్న వెంచర్లపై నజర్‌ వేస్తోంది. పోలీస్‌ స్టేషన్ల వారీగా గతంలో ల్యాండ్‌ గ్రాబర్లుగా ముద్రపడిన వారి ఆగడాలపై పోలీసులు నిఘా పెట్టారు. రాష్ట్రంలో తొలిసారిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో స్పెషల్‌ పిటిషన్‌ సెల్‌ను నగర పోలీస్‌ కమిషనర్‌ వేశారు. ఈ సెల్‌కు అందుతున్న ఫిర్యాదుల విచారణలో వేగం పెంచారు. భూ మాఫియా ఆగడాలను అరికట్టాలని, ఇందులో ఎవరున్నా, ఏ స్థాయి వారైనా సరే ఉపేక్షించేదిలేదన్న స్పష్టమైన సంకేతాలను సర్కార్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వరంగల్‌ మహానగరం చుట్టుపక్కల, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములను అమాయక రైతులను బెదిరింపులకు గురిచేసి కాజేయాలని చూసే వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ల్యాండ్‌ గ్రాబర్లకు రెవెన్యూ, పోలీసు శాఖల్లో పనిచేస్తున్న వారిని, వరంగల్‌ మహానగరంలో లోగడ పనిచేసి రిటైర్‌ అయిన రెవెన్యూ ఉద్యోగుల కార్యకలాపాలపై నిఘా వేసినట్టు తెలుస్తున్నది.

హోం నుంచే మొదలు..
నగరంలో పేట్రేగిపోతున్న భూ మాఫియా ఆగడాలు అరికట్టాలంటే ముందుగా తమ ఇంటి నుంచే పని మొదలుపెట్టాలని పోలీసు శాఖ స్పష్టమైన సంకేతాలిచ్చింది. అందులో భాగంగా ఇటీవలే కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భారీ ఎత్తున భూ దందాకు పాల్పడే వారికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించారనే ఆరోపణలపై సీఐ రాఘవేందర్‌రావు, ఎస్సై విఠల్‌పై వేటు వేసింది. హసన్‌పర్తి, కేయూసీ, సుబేదారి, మిల్స్‌కాలనీ, ఇంతేజార్‌గంజ్‌, మమునూర్‌, కాజీపేట, మడికొండ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న ల్యాండ్‌ గ్రాబర్స్‌ జాబితాను సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదేవిధంగా ఈ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని రెవెన్యూ అధికారుల తీరుపై వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది. నగరంలో పలుకుబడి ఉన్న కొంతమంది పెద్దమనుషుల ముసుగులో కావాలనే భూ పంచాయతీలు సృష్టించి వారి దగ్గరికి ఆ పంచాయతీ వచ్చేలా చేసి తద్వారా ఆ భూమిని కాజేశారని కొంతమందిపై ఫిర్యాదులు అందినట్టు వీటిపై పోలీసు శాఖ తన పరిధిలో ఉన్న వ్యవస్థపైనే ఆధారపడకుండా వివిధ మార్గాల ద్వారా వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది.

హన్మకొండ మండలం, హసన్‌పర్తి మండలంలోని గ్రామాల్లో భూ మాఫియా పేట్రేగి పోలీస్‌స్టేషన్లు, కోర్టు మెట్లెక్కని భూములను కావాలనే వివాదాలు సృష్టించి చేస్తున్న కొంతమందిని గుర్తించి వారిపై నిఘా వేసినట్టు తెలుస్తున్నది. సమాజంలో పెద్దల ముసుగులో ఉన్న కొంత మంది ఇటువంటి దందాలకు పాల్పడుతూ అమాయకులను బెదిరింపులకు గురిచేస్తున్నట్టు వస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని నగర పోలీస్‌ కమిషనర్‌ ఇప్పటికే ఎస్‌హెచ్‌వోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు పరిధిలో ఉండే అంశాలు, రెవెన్యూ కోర్టుల పరిధిలో ఉండే విషయాలను ఒక్కమాటలో చెప్పాలంటే చట్టం పరిధిలో ఉండే అంశాలను కాదని కొంతమంది తామే చట్టంగా వ్యవహరిస్తూ ఉండేవారి కార్యకలాపాలపై నజర్‌ వేయాలని, అటువంటి వ్యక్తుల లింకు సంబంధాలుంటే ముందు వారినే అప్రమత్తం చేసి వారి ద్వారా వ్యవస్థలో పలుకుబడి, పదవీకి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించాలని పోలీస్‌ బాస్‌ సంబంధిత పోలీస్‌ స్టేషన్ల అధికారులకు స్పష్టమైన మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది.

భూ మాఫియాకు సహకరించే వారిలో హోంగార్డు, కానిస్టేబుల్‌ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరున్నా సరే వారి జాబితాను ముందుగా సిద్ధం చేయాలని పోలీస్‌బాస్‌ ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే రాష్ట్రంలోనే తొలిసారిగా నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో భూ సంబంధ వివాదాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని స్వయంగా పోలీస్‌ బాస్‌ దగ్గరే పెట్టుకొని ప్రతీ కేసును క్షుణ్నంగా పరిశీలించడంలోని ఆంతర్యం అదేననే చర్చ సాగుతున్నది. ఈ సెల్‌కు ఇప్పటి వరకు 20 బలమైన ఫిర్యాదులు అందగా.. అందులో నాలుగింటిపై సమగ్ర విచారణ జరిపి కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయని, రెండు మూడు రోజుల్లో వెల్లడించే అవకాశాలున్నాయని సమాచారం. మొత్తంగా భూ మాఫియా ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...