పారిశుధ్య నిర్వహణ ఇలాగేనా..?


Sun,June 16, 2019 03:32 AM

-రోగులను పిల్లల వలే చూసుకోవాలి
-మంచి వాతావరణం అందరికీ శ్రేయస్కరం
-ఎంజీఎంను సందర్శించిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ రాములు
-ఎఫ్‌ఎస్‌టీపీ, డంపింగ్‌ యార్డ్‌ పరిశీలన
-పరిశుభ్రత, పచ్చదనంపైప్రతీ ఉద్యోగి దృష్టి సారించాలి
-కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష
వరంగల్‌, నమస్తేతెలంగాణ/ ఎంజీఎం/సుబేదారి,మడికొండ : పేదలకు చికిత్స అందించే ఎంజీఎం దవాఖానలోని పరిసరాలు ఇలా ఉంటే ఎలా.. మంచి వైద్యంతోపాటు ఆహ్లాదకర వాతావరణం ఎంతో అవసరమని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ రాములు అన్నారు. శనివారం ఆయన ఎంజీఎం దవాఖానలో పర్యటించారు. ఈ సందర్భంగా దవాఖానలో అణువణువు కలియ తిరిగారు. చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ నిల్వ ఉండటంపై అసంతృప్తిం వ్యక్తం చేశారు. ప్రధానంగా దవాఖాన ఆవరణలోని డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండి మురుగునీరు అంతర్గత రహదారులపై పారుతూ దుర్వాసన వెదజల్లడంపై అధికారులను సున్నితంగా మందలించినట్లు తెలిసింది. ఇలా ఉంటే రోగులు మరిన్ని వ్యాధుల బారిన పడరా..అని ప్రశ్నించారు. దవాఖానకు వివిధ జబ్బులతో వచ్చే రోగులను పిల్లల వలే చూసుకోవాలని సూచించారు. మార్చురీ విభాగాన్ని సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను సమీక్షించారు.

తొలిసారిగా ఎంజీఎం దవాఖానకు వచ్చిన ఆయన ఓపీ ల్యాబ్‌ నుంచి మొదలుకొని ఫిమేల్‌ సర్జికల్‌ వార్డు సమీపంలోని పరిసర ప్రాంతాల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. నీరులేక ఎండిపోతున్న వాటికి నీరుపోయాలని సూచించారు. డ్రైనేజీలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అనంతరం ఐడీ వార్డుకు సమీపంలో స్మార్ట్‌ సిటీలో భాగంగా మంజూరైన సుమారు రూ.1.30కోట్లతో నిర్మిస్తున్న సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులను సందర్శించారు. ఆయన వెంట వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, హరిత, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బత్తుల శ్రీనివాసరావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జేవీరావు, వరంగల్‌ నగర పాలక సంస్థ కమిషనర్‌ రవికిరణ్‌, అర్బన్‌ డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్‌, ఎంహెచ్‌వో డాక్టర్‌ రాజిరెడ్డి, ఎంజీఎం ఆర్‌ఎంవోలు డాక్టర్‌ వెంకటరమణ, డాక్టర్‌ సాంబరాజు ఏజిట్‌ గ్రూపు సంస్థ ప్రాంతీయ ఇన్‌చార్జి ఖాజామోహినోద్దీన్‌, ఎంజీఎం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ హహ్మద్‌ ఖాజాషరీఫ్‌, ఇన్‌చార్జి రాంప్రసాద్‌తోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఎఫ్‌ఎస్‌టీపీలు ఏర్పాటు చేయాలి
నగర అవసరాలకు అనుగుణంగా మానవ మల, మూత్ర వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని జస్టిస్‌ సీవీ రాములు అన్నారు. శనివారం నగర పర్యటనకు వచ్చిన ఆయన కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అమ్మవారిపేటలో నిర్వహిస్తున్న ఎఫ్‌ఎస్‌టీపీని సందర్శించారు. సెప్టిక్‌ ట్యాంక్‌ల నుంచి సేకరించిన మానవ మల వ్యర్థాలను శుద్ధి చేసే విధానాన్ని పరిశీలించారు. సెప్టిక్‌ ట్యాంక్‌ ఆపరేటర్లు మలాన్ని ఏ స్థాయిలో ప్రతీ రోజు తీసుకువస్తారు, దాని ద్వారా వచ్చే ఆదాయం ఎంత.. అని ఆయన అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 20 కెఎల్‌డీ సామర్థ్యం కలిగిన ఎఫ్‌ఎస్‌టీపీ ఫైరోలైసిస్‌ విధానంతో మానవ వ్యర్ధ్యాలు శుద్ధి చేస్తామని సిబ్బంది వివరించారు. 15 కెఎల్‌డీ సామర్థ్యం కలిగిన ఎఫ్‌ఎస్‌టీపీలో బయోడిజాస్టర్‌ విధానంతో శుద్ధి చేస్తామని తెలిపారు. ప్లాంట్‌ పరిసరాలతో పాటు అవరణలో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎస్‌టీపీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. నగర జనాభా ప్రాతిపదికన మరిన్ని ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్‌ రవికిరణ్‌, ఎన్విరాన్‌మెంట్‌ జాయింట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ రవీందర్‌ రెడ్డి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్లు ఇన్‌చార్జి ఈఈ రామప్ప సిద్ది, బల్దియా ఎంహెచ్‌వో డాక్టర్‌ రాజారెడ్డి, ఈఈ శ్రీనివాసరావు, శానిటరి సూపర్‌వైజర్‌ సుధాకర్‌,డీఈ సంజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

పరిశుభ్రత, పచ్చదనంపై దృష్టి సారించాలి..
కార్యాలయ పరిశుభ్రత, పచ్చదనంపై ప్రతీ ఉద్యోగి రోజుకు 10 నిమిషాలు కేటాయించాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రాష్ట్రస్థాయి కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ రాములు సూచించారు. ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉన్నదన్నారు. శనివారం వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరితతో కలిసి మున్సిపాలిటీ, వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలను అమలు చేసేందుకు రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో గ్రీన్‌ నిబంధనలను అమల్లోకి తెచ్చేందుకు అధికారులతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు.

నైజాం కాలంలో నిర్మించిన అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలు అందంగా, ఆహ్లాదకరంగా ఉండేవన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు, పై కప్పులు చెత్తాచెదారం, ఆకులతో నిండి ఉంటున్నాయన్నారు. ప్రతి ఉద్యోగి తన విధుల్లో భాగంగా కార్యాలయాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌తో సమాజంలో కొంత మార్పు కనిపిస్తున్నదని తెలిపారు. దీనిని నూరు శాతం విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ వరంగల్‌ నగరాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు ఆధునిక డిజైన్లతో నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ లక్ష్యాలను సాధించుటకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మానవ మల వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్‌ పనితీరు బాగున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, జిల్లా రెవెన్యూ అధికారి పీ మోహన్‌లాల్‌, జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌ రవీందర్‌రెడ్డి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇన్‌చార్జి ఈఈ రామప్పసిద్ధి, డీఎం అండ్‌ హెచ్‌వో హరీశ్‌రాజ్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌ బీ శ్రీనివాస్‌రావు, మున్సిపల్‌ హెల్త్‌ అధికారి రాజారెడ్డి పాల్గొన్నారు.

డంపింగ్‌ యార్డు పరిశీలన
మడికొండ శివారులోని డంపింగ్‌యార్డును నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ రాములు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డంపింగ్‌ యార్డులో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను చూశారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ రవికిరణ్‌తో మాట్లాడి యార్డు వివరాలను సేకరించారు. పేరుకుపోయిన చెత్తను మినహాయించి నగరం నుంచి వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు రీఫిల్లింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంహెచ్‌వో రాజారెడ్డి, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...