రైతుకు బాసటగా ప్రభుత్వం


Fri,June 14, 2019 03:39 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందాలనే సకల్పంతో జిల్లా వ్యాప్తంగా ధాన్యం దిగుబడి కార్యాచరణ రూపొందించి పకడ్బందీగా అమలుచేస్తోంది. ప్రతీ గింజకు తగిన ధరను అందించి కొనుగోలు చేస్తామని ప్రకటించిన అధికారులు ఆ దిశలో జిల్లా రైతులకు బాసటగా నిలిచారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్ముకోగలిగారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ ఆదేశాలతో కొనుగోలు చేసి మంచి ధరలను వచ్చేలా అధికారులు చూశారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల ద్వారా గత ఏడాదికన్నా ఈ ఏడాది అత్యధికంగా ధాన్యం క్రయవిక్రయాలు జరిగాయి.

ఎన్నడూ లేనంతగా దిగుబడి..
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సాగునీటి వసతి, 24 గంటల విద్యుత్, అందుబాటులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఉంచడం వల్ల మూడేళ్ల కాలంలో ఎన్నడూలేనంతగా ఈ సారి యాసంగిలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీతోపాటు ప్రాథమిక సహకార సంఘాలు, జీసీసీల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లా అధికార యంత్రాంగం 37 ఐకేపీ కేంద్రాలు, 69 ప్రాథమిక సహకార సంఘాలు, ఒక జీసీసీ కేంద్రం ఏర్పాటు చేసింది. మొత్తం 107 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను పూర్తిచేసింది.

రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు..
జిల్లాలో 7,814 మంది రైతులు ఐకేపీ కేంద్రాల్లో, 15,436 మంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ధాన్యాన్ని విక్రయించారు. 23,250 మంది రైతుల ద్వారా 103716.160 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ కేంద్రాల్లో కొనుగోలు చేశారు. వీటిలో ఎ-గ్రేడ్ ధాన్యం 93694.080 మెట్రిక్ టన్నులు, సాధారణ ధాన్యం 10022.080 మెట్రిక్ టన్నులు సేకరించారు. మొత్తం ధాన్యాన్ని జిల్లాలోని పారాబాయిల్డ్, రా రైస్ మిల్లులకు తరలించారు. దీనికోసం రూ.183.38 కోట్లు అవసరం కాగా రైతులకు దశలవారీగా చెల్లిస్తూనే ఉన్నారు. ఇక రూ.21.02 కోట్లు ఆన్‌లైన్ పద్ధతిలో చెల్లించేందుకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. బ్యాంకు ఖాతాల్లో ఇప్పటివరకు రూ.117.51 కోట్లు జమ చేశారు. రైతులకు ఆన్‌లైన్ మానిటరింగ్ సిస్టం ద్వారా మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు ఆయా విభాగాలతో సమన్వయం చేస్తున్నారు.

పక్క జిల్లాల నుంచి ధాన్యం రాక..
వరంగల్ రూరల్ జిల్లాలో అవసరమైన రైస్ మిల్లులు ఉన్నాయి. దీంతో మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యాసంగి ధాన్యం వచ్చింది. దీనికి సంబంధించిన చెల్లింపులను ఆయా జిల్లాల్లోని అధికార యంత్రాంగం చూసుకుంటుంది. సెంట్రల్ వూల్ పద్ధతిలో బాయిల్డ్ రైస్, రా రైస్‌ను ఎఫ్‌సీఐ కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ద్వారా ఇప్పటికే 75 శాతం బియ్యాన్ని సేకరించారు. మరో పది శాతం బియ్యం జిల్లాలోని మిల్లుల్లో సిద్ధంగా ఉంది. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సవ్యంగా నిర్వహించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బందిలేకుండా అధికారులు చూశారు. కల్లాల్లో ధాన్యం తడిసిన సందర్భంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొనుగోలు చేశారు. ఆన్‌లైన్ ద్వారా బిల్లుల చెల్లింపు జరుగుతోంది. ఆన్‌లైన్ విధానం ద్వారా జాప్యం జరుగుతుందని, దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. కేంద్రాలకు వచ్చిన ప్రతీరైతు వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...