నట్టింట ముంచారు..


Mon,May 27, 2019 02:01 AM

మన జిల్లాలోకి ప్రవేశం ఇలా..
మాల్యవి కరుణోదయ సొసైటీ సంస్థ మొదటగా హసన్‌పర్తి మండలం జయగిరిలో గతేడాది నవంబరులో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. సంస్థకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి ముందుగా గ్రామానికి వచ్చి కొందరితో పరిచయాలు పెంచుకొని రూ.30 వేల ఇంటి గురించి వివరించాడు. కేవలం ఆరు నెలల్లో మేం కట్టే ఇల్లు పూర్తయిన తర్వాత మరో రూ.2.20 లక్షలు వాయిదా కింద కడితే సరిపోతుందని, మీకు రూ.7.5 లక్షల విలువ చేసే ఇల్లు వస్తుందని నమ్మబలికాడు. నమ్మకం కోసం మొదటగా ఐదుగురు వ్యక్తులను హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయానికి తీసుకెళ్లి, అక్కడ నుంచి యాదాద్రి జిల్లాలో పాక్షిక నిర్మాణంలో ఉన్న కొన్ని ఇళ్లను చూపించారు. అక్కడ బేస్మింట్ వరకు నిర్మించి ఉన్న ఇళ్లను చూడగానే సంస్థను పూర్తిగా నమ్మేశారు. దీంతో గ్రామస్తులు సుమారు 50 మంది వరకు రూ. 30 వేల చొప్పున చెల్లించారు. ఇందులో 10 మంది వరకు పునాదులు తవ్వి పుట్టింగ్‌లు నిలబెట్టారు. ఇక మిగతా వారిని రేపు మాపంటూ ఆరు నెలలుగా ఏమార్చుతూనే ఉన్నారు. అందరిలో అసహనం పెరుగుతున్నప్పటికీ ఇల్లు పోతుందనే భయంతో ఓపికగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆదివారం నమస్తేతెలంగాణ జయగిరి గ్రామాన్ని సందర్శించినప్పుడు అన్ని వాడల్లోంచి బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

జయగిరిని చూపి 4 జిల్లాల్లో పాగా..
మల్యావి సంస్థ ప్రతినిధులు జయగిరి గ్రామంలో బేస్మింట్ వరకు నిర్మించిన కొన్ని ఇళ్ల వద్దకు పలు జిల్లాల నుంచి తీసుకొచ్చి చూపించి, తమ సంస్థకు డబ్బులు చెల్లిస్తే మీదగ్గర కూడా పనులు వేగంగా జరుగుతాయని చెప్పుకొచ్చారు. మేం ఎంతమందికి ఇళ్లు తొందరగా నిర్మిస్తే అంతే తొందరగా ఎన్‌ఆర్‌ఐలు నిధులు సమకూర్చుతారని నమ్మించారు. దీంతో అదే మండలంలోని అనంతసాగర్, మడిపల్లి, హసన్‌పర్తితో పాటు పలు గ్రామాల్లో ఈ ఇళ్ల కథ మొదలైంది. ఇక వరంగల్ రూరల్ జిల్లా పరకాల, భూపాలపల్లి మండలం రేగొండ, మొగుళ్లపల్లి, సిద్దిపేట జిల్లా అక్కన్న పేట మండలం కట్కూరులలో వందలాది మంది వద్ద డబ్బులు వసూలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో రూ.40 వేలు కూడా వసూలు చేశారు. అక్కడక్కడ రూ.10 వేల విలువ చేసే సామగ్రి దించి ఇక ముఖం చూపించడం లేదని బాధితులు వాపోతున్నారు. మొత్తంగా చూస్తే సుమారు 500 మంది నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.

ఉన్న ఇల్లు ఇప్పుకొని..
మాల్యవి కరుణోదయ ఉచ్చులో అనేక మంది అమాయకులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చదువుకున్న వారు కూడా ఏమో ఇల్లు వస్తుంది కావచ్చు అనే ఆశతో డబ్బులు చెల్లించారు. సదరు సంస్థ ప్రతినిధులు కూడా మీరు తొందరగా ఇంటి జాగాను చూపిస్తే అంతే తొందర్లో మేం మీకు కొత్త ఇంటిని నిర్మించి ఇస్తామని చెప్పడంతో ఇంకా కొన్ని ఏండ్లు నివాసానికి యోగ్యంగా ఉన్న గృహాలను సైతం కూల్చేసుకున్నారు. పిల్లర్లకు గుంతలు తీసి నెలలు గడుస్తున్నా సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో నిరాశతో కొందరు గుంతలను మళ్లీ పూడ్చుకున్నారు. ఇక కొందరు పుట్టింగ్‌లు వేసి మిగతా సామగ్రి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక కొందరు మొదలుపెట్టిన ఇల్లు ఆపవద్దనే ఆలోచనతో అప్పులు చేసి కట్టుకుంటున్నారు. అందమైన బ్రోచర్లను, ఇంటి ప్లాన్లను చూపించి మమ్మల్ని మోసం చేసిన వారిని పట్టుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

మావోళ్లు ఇద్దరు డబ్బులిచ్చిండ్రు
రూ.30 వేలకే ఇళ్లు కట్టిస్త మంటే నమ్మి మా అన్న, తమ్ము డు ఇద్దరు పైసలు కట్టారు. డబ్బు లు తీసుకున్న తర్వాత పిల్లర్లకు రంధ్రాలు తీయించారు. అప్పట్నించి మళ్లీ పనులు ముట్టుకున్న పాపాన పోలేదు.
-ఏలిమి ఆంజనేయులు, గ్రామస్తుడు

వరంగల్ సబర్బన్, నమస్తేతెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసిన రూ.30 వేలకే ఇళ్లు బాధితులు జిల్లాలోనూ వందలాదిగా ఉన్నారు. మాల్యవి కరుణోదయ సొసైటీ పేదలను బరిడి కొట్టించి కోట్లాది రూపాయలు వసూలు చేసి చివరకు పోలీసులకు చిక్కడంతో మన జిల్లాలోనూ బాధితులు బయటకు వచ్చారు. పేదల ఇంటి ఆశను ఆసరాగా చేసుకొని రంగంలోకి దిగిన కేటుగాళ్లు అమాయకులకు మాయమాటలు చెప్పి అప్పనంగా డబ్బులు కొట్టేశారు. తక్కువ ఖర్చుతో ఇల్లు వస్తుందనే ఆశతో అప్పులు తెచ్చి దళారుల చేతుల్లో నగదును కుమ్మరించారు. నెలలు గడుస్తున్నా రేపుమాపు అనడమే కానీ ఇళ్ల నిర్మాణం మాత్రం ప్రారంభించడం లేదు. తాజాగా యాదాద్రి జిల్లాలో 2700 మందిని అదే సంస్థ మోసం చేసినట్లుగా వార్తలు రావడంతో ఇక్కడి బాధితులు లబోదిబోమంటున్నారు.

మాల్యవి సంస్థ చరిత్ర ఇది..
ఖమ్మం జిల్లాకు చెందిన కొండ కృష్ణమ్మ, కొండ రమేశ్ వ్యవస్థాపక సభ్యులుగా, మరి కొందరిని చేర్చుకుని మాల్యవి కరుణోదయ సొసైటీ పేరుతో 2004లో ఓ స్వచ్ఛంద సంస్థను రిజిస్టర్ చేసుకున్నారు. వృద్ధులకు, వికలాంగులకు సేవ చేసేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా తమ అసలు ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టారు. దీనికి ముందుగా పాత నల్గొండ జిల్లాను ఎంపిక చేసుకున్నారు. అక్కడి వారినే కొందరిని కో-ఆర్డినేటర్లుగా నియమించుకుని రూ.30 వేలకు పేదలకు ఇండ్లు కట్టిస్తామని పలు గ్రామాల్లో నమ్మకాన్ని సంపాదించుకున్నారు. దీంతో వేలాది మంది వీరి మాటలు నమ్మి కోట్లాది రూపాయలను ఈ సంస్థ ప్రతినిధులకు చెల్లించారు. కాలం గడుస్తున్నప్పటికీ ఇళ్లు కట్టే కార్యక్రమం మొదలుకాకపోవడంతో ఓ మహిళా బాధితురాలు చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసు స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) సంస్థ ప్రతినిధులను అదుపులోకి తీసుకుంది.

ఈ ఫొటోలో కనిపిస్తున్న కొంగంటి మొగిళి,లలిత దంపతులకు పూర్వీకుల నుంచి వచ్చిన గూన పెంకుల ఇల్లు ఉంది. ఏటా వర్షాలకు ఉరువకుండ మరమ్మతులు చేసుకుని గడుపుతున్నారు. కూతురు పెండ్లి చేస్తే తమకు ఇల్లు ఉన్నా, లేకున్నా ఒక్కటేననే ధీమాతో ఉన్నారు. ఈ తరుణంలోనే దళారుల దృష్టి మొగిలిపై పడింది. రూ.30 వేలకు ఇల్లు వస్తుంటే ఎందుకు కట్టవని ప్రశ్నించారు. దీంతో ఆశ పడిన మొగిలి ఉన్న ఇంటిని కూల్చి పక్కింటోళ్ల రేకుల షెడ్డులో తాత్కాలికంగా ఉంటున్నాడు. ఎన్ని నెలలు గడిచినా మాల్యవి సంస్థ ఇతని ఇల్లు కట్టుడు ప్రారంభించలేదు. దీంతో తప్పనిసరై తమకు జీవనోపాధి కల్పించే గొర్లను అమ్మి వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇప్పుడు బిడ్డ పెండ్లి ఎట్ల చేసుడనే రందితో ఈ దంపతులు కుమిలిపోతున్నారు.

నా కొడుకు డబ్బులు చెల్లించాడు
అగ్గువ ధరకు ఇల్లు కట్టిత్తనంటె పాతబడిన ఇంట్ల ఎన్ని రోజులుందమని నా కొడుకు అప్పు తెచ్చి 30 వేల రూపాయలు కంపెనోళ్లకు కట్టిండు. ఆర్నెళ్లయిన తట్టెడు మట్టి గుడ పొయ్యలె.
-ఏలిమి చిన బొందాలు, జయగిరి

నమ్మిచ్చి పైసలు పట్టుకపోయిండ్రు
ఇట్ల పైసలు కట్టుడే ఆలస్యం మీకు ఇల్లు వచ్చుడే అని చెప్పిండ్రు. ముందుగాల పొక్కలు తీసి, గింత రాడు వేస్తే సంబురపడినం. ఖతం గాన్నే ఆగింది. భూమి వరకు వచ్చింది. ఆగి పోయింది. మోరం గూడా మేమే పోసుకున్నం.
-ఈద నర్సయ్య, బాధితుడు

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...