పీడిస్తున్న మ(న)కిలీ


Tue,May 21, 2019 01:26 AM

-అన్నదాతకు కల్తీ విత్తన బెడద
-పత్తిలో ట్రిపుల్‌ పేరిట బురిడీ
-పొరుగు జిల్లాలో దొరికిన నకిలీ విత్తులు
-ప్యాకింగ్‌కు సిద్ధంగా 60 క్వింటాళ్ల విత్తనాలు
-అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
-స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు
-విత్తన వ్యాపారులపై పోలీస్‌ నిఘా
-అన్ని దుకాణాల్లోనూ విస్తృత తనిఖీలు
-సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

వరంగల్‌ సబర్బన్‌, నమస్తేతెలంగాణ: వ్యవసాయ రంగంలో పత్తి పంటది అగ్రస్థానం. రైతులు ఎన్ని పంటలు వేసినప్పటికీ ఎంతోకొంత పత్తిని ఏటా తప్పకుండా సాగు చేస్తారు. జిల్లా సేద్యంలో దాదాపుగా సగం వరకు పత్తి పంట సాగువైపే రైతులు మొగ్గుచూపుతారు. ఈ సారి జిల్లాలో 80 వేల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేసే అవకాశం ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తొలకరి పలకరింపుతోనే పత్తి విత్తుకునేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. అయితే అన్నదాతలు సాగు చేసేందుకు మేలైన విత్తనాలు లభించడం సమస్యగా మారింది. నకిలీల పుణ్యమా అని బ్రాండెడ్‌ విత్తన ప్యాకెట్లను సైతం అనుమానంగా చూడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాకు పొరుగునే ఉండే కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌లో రెండు రోజుల క్రితం ప్యాకింగ్‌కు సిద్ధంగా ఉన్న 60 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడటం సంచలనం సృష్టించింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు.

కరీంనగర్‌ నుంచే అధికంగా..
నకిలీ పత్తివిత్తనాలు పెద్ద ఎత్తున కరీంనగర్‌ జిల్లా నుంచే మన జిల్లాకు దిగుమతి అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇతర రాష్ర్టాల నుంచి క్వింటాళ్ల కొద్ది పత్తి విత్తనాలను టోకున తెస్తున్న బ్రోకర్లు మూత పడ్డ రైస్‌ మిల్లులు, రహస్యంగా ఉండే గోదాముల్లో నిల్వ చేసి ఆకర్షణీయమైన పేర్లతో అందంగా ప్యాకింగ్‌ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని రైతులకు అంటగడుతున్నారు. కేవలం కరీంనగర్‌ నుంచే కాకుండా, హైదరాబాద్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడి గింజలు తెచ్చి కొత్త ప్యాకెట్లలో నింపి అధిక దిగుబడుల ఆశ చూపి అమ్మకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం హుజూరాబాద్‌లోని ఓ రైస్‌మిల్లులో గాజుల శ్రీను అనే వ్యక్తి నిల్వ చేసిన 60 క్వింటాళ్ల విడి పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. నిందితుని కోసం గాలిస్తున్నారు. గతేడాది సైతం కరీంనగర్‌ నగరంలో 24 క్వింటాళ్ల విడి నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి.

ట్రిపుల్‌ పేరిట ట్రబుల్‌
తెల్లబంగారంగా పిలుచుకునే పత్తి పంటను పట్టి పీడిస్తున్న చీడపీడలను తట్టుకునేందుకు ముందుగా సింగిల్‌ బీటీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి. ఆ తర్వాత మరింత ఆధునీకరించి డబుల్‌ బీటీ విత్తనాలు ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్ర సమస్యగా మారింది. దీన్ని అధిగమించేందుకు ట్రిబుల్‌ బీటీ పేరిట హెర్బిసైడ్‌ టాలరెంట్‌(హెచ్‌టీ) విత్తనాల ప్రయోగాలు జరిగాయి. అయితే ఇవి మనుషుల ప్రాణాలతో పాటు, పర్యావరణానికి ముప్పుగా ఉండడంతో ప్రభుత్వం వీటికి అనుమతి ఇవ్వలేదు. కానీ ఈ విత్తనాల టెక్నాలజీని కొందరు ప్రైవేట్‌ వ్యక్తులు అందిపుచ్చుకొని ట్రిపుల్‌ బీటీ పేరిట విత్తనాలను ప్యాక్‌ చేసి అమ్ముతున్నారు. గడ్డి కలుపు బాధలు ఉండవనే నమ్మకంతో అమాయక రైతులు ఈ విత్తనాలను సాగు చేస్తున్నారు. మన జిల్లాలోనూ కొందరు విత్తన వ్యాపారులు అక్రమాలకు పాల్పడి కేసుల పాలైయ్యారు.

సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి
నాలుగు రోజుల వ్యవధిలో హైదరాబాద్‌తో పాటు, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడటంతో సీఎం కేసీఆర్‌ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఈ నకిలీ విత్తన దందాపై ఉక్కుపాదం మోపేందుకు వ్యవసాయ శాఖతో పాటు, పోలీసు శాఖనూ ఆదేశించారు. దీంతో ఆయా శాఖల అధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలోని అన్ని విత్తన విక్రయ దుకాణాలను ఇటు పోలీసులు, అటు వ్యవసాయ శాఖ అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ టీంలు, హైదరాబద్‌ నుంచి నియమించిన స్పెషల్‌ స్వాడ్‌ బృందాలు జల్లెడ పడుతున్నాయి. ఎక్కడ అనుమానం వచ్చిన కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా రైతాంగానికి 2 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం ఉంటుందని అంచనా వేసిన అధికారులు అంతకు మించి స్టాక్‌ను వ్యాపారులతో ఇండెంట్‌ పెట్టించారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...