ట్రయల్ రన్‌కు వస్తా..


Mon,May 20, 2019 03:27 AM

-పనుల పూర్తికి జూన్ నెలాఖరు డెడ్‌లైన్
-జూలై నుంచి రెండు టీఎంసీల నీరు తరలించాలి
-కాళేశ్వరం పనులపై సీఎం కేసీఆర్ ప్రశంసలు
-కన్నెపల్లి పంపుహౌజ్, మేడిగడ్డ బ్యారేజీ సందర్శన
-కాళేశ్వర ముక్తీశ్వరుడికి సీఎం దంపతుల పూజలు
-సీఎం పర్యటనకు భారీగా పోలీసు బందోబస్తు

జయశంకర్ జిల్లా ప్రతినిధి/ నమస్తే తెలంగాణ;కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జూన్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలి. జూలై నుంచి రెండు టీఎంసీల నీటిని తరలించాలి. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం ఎంత ముఖ్యమో.. ప్రాజెక్టు నిర్వహణ కూడా అంతే ముఖ్యం. ప్రణాళిక ప్రకారం జూలైకల్లా రెండు టీఎంసీల నీటిని రైతులకు అందించనుండటం శుభపరిణామం. పనులు వేగంగా జరగాలనే తొందరలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులు సూచనలు చేశారు. ఆదివారం ఉదయం కాళేశ్వరం చేరుకున్న సీఎం తొలుత సతీసమేతంగా కాళేశ్వర ముక్తీశ్వరుడికి పూజలు చేశారు. అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించారు. అక్కడినుంచి మేడిగడ్డ బ్యారేజ్ చేరుకున్నారు. రెండున్నర గంటలపాటు అక్కడే ఉండి బ్యారేజ్ పనులను పరిశీలించడంతోపాటు సాగునీటి అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. 44 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల మండుటెండలోనూ ఆయన మేడిగడ్డ వద్ద వ్యూ పాయింట్, బ్యారేజీ పైనుంచి, గోదావరిలో దిగి పనులను పరిశీలించారు. అంతకుముందు కాళేశ్వరం ఆలయాన్ని రూ.100కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అర్చకులకు క్వార్టర్లు, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతామని ప్రకటించారు.

అపర భగీరథుడు, సీఎం చంద్రశేఖర్ రావు కాళేశ్వరంలో ఆదివారం కలియదిరిగారు. సీఎం కేసీఆర్, శోభ దంపతులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి దంపతులు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఉదయం కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనాల్లో కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీలో ముడుపులు వేశారు. సీఎం కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు జ్ఞాపిక, స్వామివారి శేష వస్ర్తాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అక్కడి నుంచి గోదావరికి చేరుకొని పండితులతో సంకల్పం చేశారు. అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకొని అల్పాహారం చేశారు. సీఎం కేసీఆర్ లిఫ్ట్ ద్వారా పంప్‌హౌస్‌లోకి వెళ్లి మోటార్ల బిగింపు పనులను చూశారు. హెచ్‌టీ, ఎల్‌డీ, కంట్రోల్ రూం ప్యానళ్లను పరిశీలించారు. అనుకున్న సమయంలో పంప్‌హౌస్ పూర్తి చేశారని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో వెట్న్‌క్రు సిద్ధం చేయాలని, కార్యక్రమానికి తాను వస్తానని చెప్పారు. అక్కడి నుంచి మేడిగడ్డ బరాజ్ వద్దకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. బరాజ్, వంతెనను పరిశీలించారు. కార్మికుల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. జూన్ నెలాఖరు వరకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించారు. జూలై నుంచి పూర్తి స్థాయిలో నీటిని తరలించాలని సూచించారు. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తన కలల స్వప్నమని, దీనిని పూర్తి చేసి రాష్ట్ర రైతులకు కానుకగా ఇస్తానని సీఎం చెప్పారు. 44 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయక సీఎం కేసీఆర్ గంటల సమయం ప్రాజెక్టు సందర్శనకు కేటాయించారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...