రైతుబంధుకు రంగం సిద్ధం


Sun,May 19, 2019 02:32 AM

-మూడో విడత పంపిణీకి ఏర్పాట్లు
-ఈ సారి ఎకరాకు రూ.5 వేలు
-జిల్లాలో 75,085 మంది రైతులు
-లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం

వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ, మే18: అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో భాగంగా ఈ వానకాలం సీజన్‌లో ఎకరాకు రూ.5వేల చొప్పున పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లు చేస్తుండగా, జిల్లాలో వ్యవసాయశాఖ అన్నిలెక్కలు తీసిపెట్టింది. కొన్ని కారణాలతో కొందరికి రెండో విడతలో రైతుబంధు డబ్బులు జమకాలేదు. సాయం అందని వారికి ఇప్పుడు ఇచ్చే మూడో విడతలో కలిపి ఇవ్వనున్నారు. గతంలో ఎకరాకు రూ.4వేల చొప్పున ఇవ్వగా ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.5వేల చొప్పున ఇవ్వనున్నారు. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరియనుంది. ఇదే కాకుండా రుణమాఫీ కోసం కూడా ఆయా బ్యాంకుల నుంచి అర్హుల జాబితాను ఇప్పటికే తీసుకున్నారు. రెండు విడతల్లో రూ.142 కోట్ల 71 లక్షల 92 వేలు..రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వం వ్యవసాయ రంగంపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రగతి వ్యవసాయంపైనే ఆధారపడి ఉందన్న విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రత్యేక పథకాలను తీసుకొచ్చారు. మందుగా ఏండ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన చెరువుల అభివృద్ధికి మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టి చెరువులను పునరుద్ధరించారు.

ఆ తర్వాత ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా ఉండేలా కాళేశ్వరం ఎత్తి పోతల పథకానికి శ్రీకారం చుట్టి శరవేగంగా పనులు చేయిస్తున్నారు. దీంతో పాటు వ్యవసాయ పెట్టుబడి కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు పథకం పేరిట ఎకరాకు ప్రతీ పంటకు రూ.4వేల చొప్పున ఇచ్చే బృహత్తర పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే రెండు సార్లు డబ్బులను రైతులకు అందించారు. మొదటి దఫాలో చెక్కుల రూపంలో పెట్టుబడి డబ్బులను ఇచ్చారు. జిల్లాలో 77,079మంది రైతులకు రూ.71కోట్ల 47లక్షల 6వేల 780మంజూరయ్యాయి. అయితే కొందరు రైతులు బ్యాంకు అకౌంట్లు ఇవ్వక పోవడంతో పాటు ఇతర సాంకేతిక కారణాలతో 71,832 మంది రైతులు రూ.67కోట్ల 53లక్షల 50వేల50 తీసుకున్నారు. ఇక రెండో వితడలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక అనుమతితో నేరుగా రైతుల ఖాతాల్లోకే జమచేశారు. 75,985 మంది రైతులకు రూ.67 కోట్ల 63లక్షల 9వేల 650మంజూరవగా, 66,998మంది రైతులు రూ.62ఓట్ల 67లక్షల 21వేల50 తీసుకున్నారు. అయితే ఎలక్షన్‌కోడ్ ఉండడం వల్ల ఆ సమయంలో అందరికీ ఇవ్వడం సాధ్యం కాలేదు. దీంతో ఇంకా 6741మంది రైతులకు రూ.4కోట్ల 40లక్షల 56వేల90 పంపిణీ చేయాల్సి ఉంది.

మూడో విడతలో ఎకరాకు రూ.5 వేలు..
చరిత్రలో తొలిసారిగా అన్నదాతలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి ఇచ్చి ఆదుకున్నారు. ఇంతకు మందు ప్రతీ పంటకు ఎకరాలకు రూ.4వేలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి దాన్ని రూ.5వేలకు పెంచింది. దీంతో అన్నదాతల్లో ఆనందం రెట్టింపైంది. పెంచిన డబ్బులతో కలిపి మూడో విడత పంటపెట్టుబడి సాయం చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. దీనికోసం రూ.12వేల కోట్లను కేటాయించారు. జిల్లా వ్యవసాయశాఖ కూడా అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే పాతరైతుల లిస్టు సిద్ధంగా ఉండగా రైతుబంధు పోర్టల్‌లో కొత్తగా జతయ్యే రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించే పనిలో పడ్డారు. సేకరించిన అకౌంట్లను రైతబంధు పోర్టల్‌లో నిక్షిప్తం చేయనున్నారు. అన్ని సవ్యంగా జరిగితే ఎన్నికల కోడ్ ముగియగానే తొలకరి పలకరించే సమయానికి రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమవనున్నాయి. ఇదేకాకుండా రెండో విడత డబ్బులు రాని 6741మంది రైతులకు కూడా మూడో విడత డబ్బులతో కలిసి జమచేయనున్నారు. ఈసారి పెంచనున్న రైతుబంధు డబ్బులలో జిల్లా రైతాంగానికి సుమారుగా రూ.15కోట్ల వరకు అదనపు లబ్ధి చేకూరనుంది.

రైతు బీమాతో 157 మందికి రూ.7.15 కోట్లు లబ్ధి
అన్నదాతల అభ్యున్నతి కోసం రైతు కుటుంబాలకు భరోసా నిచ్చేలా సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతు బీమాతో జిల్లాలో మొదటి ఏడాదిపూర్తి కాకముందే 157మంది రైతుల కుటుంబాలకు ఈ బీమా సొమ్ము దక్కింది. జిల్లాలో 75,605 మంది రైతులుండగా అందులో 47,775మంది రైతులను రైతుబీమాకు అర్హులుగా తేల్చుతూ వ్యవసాయ శాఖ అధికారులు రైతుబీమా పోర్టల్‌కు అనుసంధానం చేయగా వీరి పేర్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ)కి పంపించి ప్రీమియం చెల్లించారు.

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 157మంది రైతులు పలు కారణాలతో మృతి చెందగా వారి కుటంబాలకు రూ.7కోట్ల 15లక్షల రూపాయలు పరిహరంగా అందాయి. కమలాపూర్ మండలంలో అత్యధికంగా 25మందికి రైతుబీమా డబ్బులు అందాయి. ఇప్పుడు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకున్న రైతులు కూడా తమ వివరాలను వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదే విదంగ రైతుబంధు పోర్టల్‌లో కొత్తగా నమోదైన రైతులు కూడా బ్యాంకు పాసుబుక్‌లను అంది స్తే రైతుబంధుకు అర్హుల జాబితా లో చేరవచ్చు.

174
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...