కనుల పండువగా వసంతోత్సవం


Thu,May 16, 2019 03:16 AM

-వేడుకగా కొనసాగుతున్న భద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలు
-సర్వభూపాలవాహనంపై ఊరేగిన అమ్మవారు
-పాల్గొన్న ముదిరాజ్‌ మహాసభ ప్రతినిధులు
మట్టెవాడ, మే 15: వరంగల్‌ నగరానికి మణిమకుఠంగా విరాజిల్లుతున్న శ్రీభద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించి చతుస్థానార్చన జరిపిన తర్వాత వసంతోత్సవం నిర్వహించారు. ముదిరాజ్‌ మహాసభ ప్రతినిధులు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ఈవో ఆర్‌.సునీత ఆధ్వర్యంలో సిబ్బంది సకల సౌకర్యాలు కల్పించారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాష్‌ దంపతులు అమ్మవారికి పట్టువస్ర్తాలను, పూలను, పండ్లు తీసుకుని మేళాతాళాలతో వేదస్వస్తితో వచ్చి అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి శోడషోహరపూజ జరిపి అమ్మవారి అనుజ్ఞ గైకొని అభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. బలి ఉత్సవనంతరం పూర్ణాహుతి జరిపిన పిమ్మట అమ్మవారికి చతుర్థసేవ నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదవితరణ, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం అమ్మవారికి సర్వభూపాల వాహనసేవ వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెబోయిన అశోక్‌, అర్భన్‌ జిల్లా అధ్యక్షుడు బయ్య స్వామి, పులి రజనీకాంత్‌, చొప్పరి సోమయ్య, పిట్టల సత్యనారాయణ, రవి, సదానందం, కవిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ జ్యూవెలరీ వెరిఫికేషన్‌ అధికారి కట్టా అంజనీదేవి కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ సతీసమేతంగా వచ్చి పూజలు చేశారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...