మహిమాన్వితుడు.. మత్స్యగిరీశుడు


Wed,May 15, 2019 03:19 AM

-నేటి నుంచి అధ్యయన తిరుకల్యాణోత్సవాలు
-కాకతీయుల కళావైభవానికి ప్రతీక ఈ ఆలయం
-రాష్ట్రంలోనే రెండో పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి
శాయంపేట, మే 14 : శాయంపేట మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీమత్స్యగిరిస్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్నాడు. కాకతీయ రాజుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన మత్స్యగిరీశుడు ఇక్కడుండడం ప్రజలు అదృష్టంగా భావిస్తారు. ఈ క్రమంలో స్వామి వారి అధ్యయన తిరుకల్యాణోత్సవాలు బుధవారం ప్రారంభమై ఈనెల 20వ తేదీ వరకు జరుగనున్నాయి. కాకతీయ రాజుల ఇలవేల్పు అయిన శ్రీమత్స్యగిరిస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోనే రెండోదిగా ప్రసిద్ధిగాంచింది. గ్రామ శివారులో మచ్చర్లయ్య గుట్ట లోపల బండరాయిపై సహజసిద్ధంగా వెలిసిన మహావిష్ణువు దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యగిరీశుడు. స్వామి వద్దకు వచ్చి కష్టాలు చెప్పుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయననే విశ్వాసం ప్రజల్లో బలంగా నెలకొంది. కాకతీయుల కాలంలో వెలిసిన శ్రీమత్స్యగిరీశుడు అప్పటి నుంచి వారి కళావైభవానికి ప్రతీకగా నిలుస్తూ అలరారుతున్నాడు. వైశాఖ శుద్ధ పౌర్ణమి పంచమి రాత్రి ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి ఏడాది మత్స్యగిరిస్వామి ఆలయంలో అధ్యయన తిరుకల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు జాతర ఏర్పాట్లను ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ సామల భిక్షపతి ఆధ్వర్యంలో సభ్యులు పూర్తిచేశారు.

ఇదీ ఆలయ చరిత్ర..
శాయంపేట పొలిమేరల్లో ఉన్న మచ్చర్లయ్య గుట్టపై మత్స్యగిరీశుడు సుమారు 563 ఏళ్ల క్రితం వెలసినట్లు భక్తులు చెబుతున్నారు. గుట్టలోపల బండరాయిపై సహజసిద్ధంగా మత్స్యగిరీశుడు నెరిసిన దృశ్యం అద్భుతంగా కనిపిస్తోంది. ఈ గుట్టలోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకేఒక చిన్న మార్గం ఉంటుంది. ధర్మసంస్థాపనార్థం, దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం ఆ మహావిష్ణువు పది అవతారాలను ఎత్తాడు. ఒక అవతారంలో దుష్టులను సంహరించి ధర్మాన్ని రక్షించాడని చరిత్ర చెబుతున్నది. ఈ దశావతారాల్లో తొలి అవతారం మత్స్యగిరీశుడిగా వెలిసినట్లు చెబుతున్నారు. కాకతీయరాజుల కళాపోషణలో దేదీప్యమానంగా స్వామి వారికి సేవలు అందించినట్లు ఇక్కడున్న శాసనం ద్వారా తెలుస్తుంది. మచ్చర్లయ్య గుట్ట మధ్యలో గ్రామ్య భాషలో శాలివాహన శకంలో వేయించిన ఈ శిలాశాసనం ఆనాటి చరిత్రను తెలియజేస్తుంది. దీని ప్రకారం ఇక్కడ 14 దేవాలయాలు, 24 మంది అర్చకులు ఉండేవారని చారిత్రక ఆధారాలున్నాయి. ఈ శాసనాన్ని కాకతీయ సామంతరాజు కొత్తగట్టుసీమ పాలకుడు రేచర్ల దర్శనాయని తండ్రి సింగమనాయని, తల్లి సింగమాంబ వేయించినటు తెలుస్తోంది. ఇక్కడున్న కోనేరు, ధ్వజస్తంభం, చిన్న గుహల్లో ఎత్తయిన రాతిపై స్వామి దర్శనమిస్తారు. అందుకని ఇక్కడి చెరువును దేవుని చెరువుగా అభివర్ణించారు. అయితే కాలక్రమంలో గుట్ట నుంచి గ్రామం దూరంగా వెళ్లిపోయింది. ఈ క్రమంలో గ్రామం మధ్యలో కాకతీయులు రాతితో నిర్మించిన వైష్ణవ దేవాలయంగా ప్రసిద్ధి కెక్కింది. అలాగే గుడిపై విష్ణుమూర్తి దశావతారాలు భక్తులకు కనిపిస్తాయి. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధపౌర్ణమి రోజు స్వామి వారి విగ్రహాన్ని ఏనుగు వాహనంపై ప్రతిష్ఠించి పుర వీధుల్లో ఊరేగిస్తూ మచ్చర్లయ్య గుట్టకు తీసుకెళ్తారు. అక్కడ భక్తులు దేవుడిని పూజించి తిరిగి వస్తారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...