నేడు పోచంపల్లి నామినేషన్


Tue,May 14, 2019 04:44 AM

-స్థానిక ఎమ్మెల్సీకి టీఆర్‌ఎస్ నుంచి దాఖలు
-హాజరుకానున్న మంత్రి ఎర్రబెల్లి, నేతలు
వరంగల్‌ప్రధాన ప్రతినిధి,నమస్తేతెలంగాణ: వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు పలువురు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో భాగస్వామ్యం కాబోతున్నారు. ఉదయం భద్రకాళి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అక్కడి నుంచి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్ దయానంద్‌కు నామినేషన్ పత్రాలు అందజేస్తారు. సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్ గెలుపు సునాయాసమే. అయినా పక్కా వ్యూహంతో పకడ్బందీ ప్రణాళికతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డుమెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు 13మంది ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం ఓటర్లు 901 కాగా పార్టీల బలబలాలరీత్యా టీఆర్‌ఎస్ సంఖ్యాబలం కాంగ్రెస్‌కు అందనంత ఎత్తులో ఉంది. మొత్తం 901మంది ఓటర్లున్న స్థానిక శాసన మండలి ఓటర్లలో 677మంది టీఆర్‌ఎస్ ఓటర్లే ఉండడం విశేషం. ఇక మిగిలిన స్వతంత్రులు 53మంది మద్దతు కూడా ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి ప్రకటించే దిశలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కేవలం 171మంది ఓటర్లుగా ఉన్నా.. వారిలో ఇప్పటికే సగానికికంటే ఎక్కువ మంది ఓటర్లు టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సైతం నేడే
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఇనగాల వెంకట్రాంరెడ్డిని ప్రకటించింది. ఇనగాల 2014 సాధారణ ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించుకొని విరమించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం రీత్యా 171 మంది ఉన్నా.. అందులో సగానికిపైగా ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు టచ్‌లో ఉండడంతో కాంగ్రెస్ వర్గాలు కకావికలమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, మద్దతు, విశ్వాసరాహిత్యం అభ్యర్థికి మరింత గందరగోళానికి లోనయ్యే అంశాలుగా ఆ పార్టీ వర్గాల వ్యవహార సరళి స్పష్టం చేస్తోంది. వరుస ఎన్నికల్లో వరుస పరాజయాలపాలవుతున్న కాంగ్రెస్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా పోటీ చేయడానికి ఎవరూ సుముఖత వ్యక్తం చేయలేదని, పోటీకి ముందుకొచ్చిన వెంకట్రామిరెడ్డికి పార్టీ వర్గాల నుంచి ఆ స్థాయిలో తోడ్పాటు అందడం లేదనే చర్చ కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం సాగుతోండటం గమనార్హం.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...