మేయర్ ఎన్నికపై కార్పొరేటర్ల సమావేశం


Fri,April 26, 2019 01:37 AM

వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 25: గ్రేటర్ వరంగల్ మేయర్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో స్టేషన్‌రోడ్‌లోని ఓ హోటల్‌లో గురువారం నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్‌లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఎస్‌ఐఐసీ చైర్మన్, గ్రేటర్ వరంగల్ మేయర్ ఎన్నికల ఇన్‌చార్జి గ్యాదరి బాలమల్లు హాజరై కార్పొరేటర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ వరంగల్ మేయర్‌గా కొనసాగుతున్న నన్నపునేని నరేందర్ పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసి గెలుపొందడంతో తిరిగి మేయర్ ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఈమేరకు ఈ నెల 27న కార్పొరేషన్ సమావేశ మందిరంలో మేయర్ ఎన్నిక ఉండటంతో పార్టీ ఆదేశాల ప్రకారం కార్పొరేటర్ల అభిప్రాయాలు సేకరించడానికి సమావేశాన్ని నిర్వహించారు. మేయర్ ఎన్నిక విషయంలో గ్రేటర్ పరిధిలోని 58మంది కార్పొరేటర్లను ఏకాభిప్రాయాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు బాలమల్లు తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్‌ల అభిప్రాయాలను సీఎం కేసీఆర్‌కు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు.

తూర్పునకు అవకాశం కల్పించాలి: ఎమ్మెల్యే నరేందర్
గ్రేటర్ వరంగల్ మేయర్‌గా వరంగల్ తూర్పు నుంచి మొదటిసారి కేటాయించారని, శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసి మేయర్ పదవిని వదులుకోవాల్సి వచ్చిందన్నారు. రానున్న రెండేళ్లకు సైతం మేయర్ పదవిని తూర్పు నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లకే ఇవ్వాలని మేయర్ ఎన్నికల ఇన్‌చార్జి గ్యాదరి బాలమల్లుకు వినతిపత్రం అందజేశారు. ఎక్కువగా పేద ప్రజలు జీవించే తూర్పు ప్రాంతానికి కేటాయిస్తే రానున్న రోజుల్లో స్థానిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఇన్‌చార్జి నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. అందుకు అందరం కట్టుబడి ఉంటామని నన్నపునేని పేర్కొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...