బ్యాలెట్ పేపర్లను సక్రమంగా ముద్రించాలి


Wed,April 24, 2019 03:27 AM

-స్థానిక సంస్థల ఎన్నికల మూడు జిల్లాల
-సాధారణ పరిశీలకుడు బీ శ్రీనివాస్
అర్బన్ కలెక్టరేట్, ఏప్రిల్ 23: బ్యాలెట్ పేపర్లను ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని సక్రమంగా ముద్రించాలని స్థానిక సంస్థల ఎన్నికల వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల సాధారణ పరిశీలకుడు బీ శ్రీనివాస్ సూచించారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు, నోడల్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై ఆయన మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అనుభవం తో బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి జారీ అయిన వివరాలను రిటర్నింగ్ అధికారులకు పంపాలని ఆయన సూచించారు. ఫొటో ఓటర్ స్లిప్పులను పంపిణీ చేసిన అనంతరం అందుబాటులో లేని, ఇతర ప్రాంతాలకు వెళ్లిన, మరణించిన వారి జాబితాను రూపొందించి ప్రిసైడింగ్ అధికారులకు అందజేయాలన్నారు. అలాగే పోలింగ్ అనంతరం వినియోగించని బ్యాలెట్ పేపర్లను భద్రపరచాలని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకుగాను చేపట్టిన బందోబస్తు, సెక్యూరిటీ ప్రణాళికలను, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ ఏర్పాట్లను కూడా ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు.

జిల్లాలో రెండు విడతల్లో పోలింగ్
వరంగల్ అర్బన్ జిల్లాలో 7 జెడ్పీటీసీలు, 86 ఎంపీటీసీల స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లను మానిటరింగ్ చేసేందుకు 12 మంది జిల్లా స్థాయి అదికారులను నోడల్ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు మండలానికి ఒక ైఫ్లెయింగ్ స్కాడ్, జిల్లా స్థాయిలో ఎస్‌ఎస్‌టీ బృందాన్ని నియమించినట్లు వివరించారు. మొదటి దశలో భాగంగా మే 6వ తేదీన హసన్‌పర్తి, ఎల్కతుర్తి, కమలాపుర్, భీమదేవరపల్లి జెడ్పీటీసీ స్థానాలతో పాటు 52 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వాహణకు గాను 273 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండో దశలో భాగంగా మే 10వ తేదీన మూడు జెడ్పీటీసీ స్థానాలతోపాటు 34 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వాహణకుగాను 184 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందికి ఈ నెల 15వ తేదీన మొదటి విడత శిక్షణ ఇచ్చామని, 27వ తేదీన రెండో విడత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మూడు దశల్లో పోలింగ్
వరంగల్ రూరల్ జిల్లాలో మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం హరిత వివరించారు. పోలింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తి చేశామన్నారు. ఈ నెలాఖరు వరకు రెండో విడత శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బీ సంతోష్, జెడ్పీ సీఈవో ఎం విజయ్‌గోపాల్, డీసీపీలు నర్సింహా, కే రంగరాజు, ఆర్డీవోలు కే వెంకారెడ్డి, సీహెచ్ మహేందర్‌జీ, ఎల్ కిషన్, డీఆర్‌డీవో రాము తదితరులు పాల్గొన్నారు.

139
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...