స్మార్ట్‌సిటీ పనుల్లో వేగం పెంచాలి


Wed,April 24, 2019 03:25 AM

వరంగల్,నమస్తేతెలంగాణ : గ్రేటర్ పరిధిలో చేపట్టిన స్మార్ట్‌సిటీ మిషన్ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని స్మార్ట్‌సిటీ మిషన్ డైరెక్టర్, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహరాల శాఖ సంయుక్త కార్యదర్శి కునాల్ కుమార్ అన్నారు. ఢిల్లీ నుంచి ఆయన మంగళవారం వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి స్మార్ట్‌సిటీ పనుల పరోగతిపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ మిషన్ వచ్చే జూన్ నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని అన్నారు. జూన్ 25 నాటికి స్మార్ట్‌సిటీ మిషన్ ద్వారా చేపట్టిన అన్ని పనులను పూర్తి చేసి ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలని ఆయన దేశించారు. స్మార్ట్ సిటీ పనుల్లో టెండర్ల ప్రక్రియ చాలా ప్రధానం అన్నారు. ఇప్పటి వరకు స్మార్ట్‌సిటీ పథకంలో మొదటి విడతలో ఎంపికైన నగరాల్లో 77 శాతం టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. రెండో విడత నగరాల్లో 69, మూడో విడత నగరాల్లో 39, నాలుగో విడత నగరాల్లో 19 శాతం పనులకు టెండర్లు పూర్తయ్యాయని అన్నారు. జూన్ 25 నాటికి మొదటి, రెండో విడతలో ఎంపికైన నగరాల్లో 85 శాతం పూర్తి కావాలని ఆయన సూచించారు. మార్చి 9వ తేదీ నాటికి రూ.45 వేల కోట్ల పనులకు టెండర్లు పూర్తి చేశారన్నారు.

ఎన్నికల కోడ్ నేపథ్యంలో టెండర్ల వ్యవహరంలో ఆలస్యం జరుతున్న విషయం వివిధ నగరాల కమిషనర్లు వివరించారు. ఎన్నికల కోడ్ ముందు ప్రారంభించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఇప్పటి వరకు స్మార్ట్‌సిటీ ద్వారా రూ.14 వేల కోట్ల పనులు పూర్తయ్యాయని ఆయన అన్నారు. కేంద్రం ఇప్పటి వరకు స్మార్ట్‌సిటీలో భాగంగా రూ.16 వేల కోట్ల నిధులు విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలో భాగం విడుదల చేసిన నిధుల వివరాలతో నివేదిక పంపించాలని ఆయన ఆదేశించారు. జూన్ 25 నాటికి స్మార్ట్‌సిటీ మిషన్ ప్రగతిని ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. 2020 నాటికి టెక్నికల్‌గా స్మార్ట్‌సిటీ మిషన్ ముగిస్తుందని, రెండు సంవత్సరాలు మాత్రమే సమయం ఉందని అన్నారు. స్మార్ట్‌సిటీ మిషన్ పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రగతిని సాధించాలని చెప్పారు. సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రవికిరణ్ మాట్లాడుతూ టెండర్లు పూర్తైన పనులను జూన్ నాటికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో టెండర్ల నిర్వహణలో జాప్యం జరుగుతోందని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బల్దియా ఎస్‌ఈ భిక్షపతి, ఈఈ విద్యాసాగర్, లీ అసోషియేట్స్ టీమ్ లీడర్ అనంద్ వోలేటి పాల్గొన్నారు.

143
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...