చెడగొట్టు వాన..


Sat,April 20, 2019 02:05 AM

- వణికిస్తున్న వడగళ్లు..
- మూడు రోజులుగా జిల్లాపై వర్ష ప్రభావం
- వరి, మామిడికి తీవ్ర నష్టం
- నేలవాలిన మొక్కజొన్న, వరి పంట
- ఆందోళనలో అన్నదాతలు
- పంట నష్టంపై నివేదికలు సిద్ధం చేస్తున్న అధికారులు

వరంగల్ సబర్బన్, నమస్తేతెలంగాణ: జిల్లా ప్రజలను మూడు రోజులుగా అకాల వర్షాలు వణికిస్తున్నాయి. సాయంత్రమైందంటే చాలూ అన్నదాతలు ఆకాశం వైపు ఆందోళనగా చూస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం సైతం జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం పడగా, ఖాజీపేట, ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు, వరంగల్, ఖిలావరంగల్, భీమదేవర పల్లి మండలాలపై పెను ప్రభావం చూపించింది. కొన్ని గ్రామాల పరిధిలో రాళ్లు పడగా, మిగతా చోట్ల బలమైన ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. వరి పంటలకు తీరని నష్టాన్ని కలిగించింది. అలాగే మామిడి తోటలు సైతం పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. రేకుల ఇళ్లకు నష్టం వాటిల్లింది. రైతులు వర్షం కోసం ఎదురుచూసి ఎన్నో రకాలుగా మొక్కినా కరుణించని వరుణుడు అవసరం లేని సమయంలో విరుచుకు పడి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాడు. ఐనవోలు, ఖాజీపేట, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో రెండో రోజూ వర్ష బీభత్సం కనిపించింది. భీ మదేవర పల్లి మండలం కొ త్తకొం డ, మల్లారం గ్రా మాల్లో వడగండ్లు కురిశా యి.

పంటలకు తీవ్ర దెబ్బ
ఈ ఏడాది వర్షాల లేమితో యాసంగిలో నిర్ణిత విస్తీర్ణంలో సగమే జిల్లాలో వరి పంట సాగు చేశారు. అటు ఎస్సారెస్పీ, ఇటు దేవాదుల రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో సైతం పరిమితంగానే వరిని వేశారు. ఆ పంటలు కూడా ఎండిపోయే దశలో ప్రభుత్వం నీళ్లు వదిలి రైతులకు కొంత మేరకు ఊరటనిచ్చింది. బావుల కింద వేసుకున్న రైతుల పంటలు చాలా వరకు ఎండిపోయాయి. ఇప్పుడు దాదాపుగా అన్ని మండలాల్లో కోత దశలో ఉన్నాయి. ఈ దశలో పంటపై రాళ్లు పడడంతో పాటు బలమైన ఈదురుగాలులు రావడంతో వరి గింజలు నేలరాలాయి. కొందరు రైతులు పంట కోసి కల్లాలో ఉంచారు. వీటిని ఉదయం ఎండబోసి తిరిగి వాన మబ్బులు కనబడగానే దగ్గరికి చేయడానికి తీవ్ర ప్రయాస పడుతున్నారు. కొన్ని చోట్ల తడిసి పోయాయి. ఈదురు గాలులకు మామిడి కాయలు పెద్ద ఎత్తున రాలి పోతున్నాయి. రాలిని కాయలను మార్కెట్‌కు తీసుకెళ్తే ప్రస్తుతం టన్నుకు రూ.30 నుంచి 40 వేలు ఉన్న ధరను అమాంతం తగ్గించి వ్యాపారులు రూ.3 నుంచి 4 వేలకే పరిమితం చేస్తున్నారు. ఇక మొక్క జొన్న నేల వాలింది.

విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తుండడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. విద్యుత్ శాఖ సిబ్బంది ముందస్తుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ బలంగ వీస్తున్న ఈదురు గాలుల వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి విద్యుత్ అంతరాయాలు ఉండడంతో వినియోగ దారులు ఇబ్బంది పడుతున్నారు.

197
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...