సమన్వయ సారథ్యమే గెలుపు మంత్రం


Fri,April 19, 2019 02:59 AM

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : వరంగల్ ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురేసేందుకు టీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కావడంతో టీఆర్‌ఎస్ ఆయా నియోజకవర్గాలకు పరిశీలకులను ఇప్పటికే నియమించి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం నిర్వహిచేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నది. గురువారం రాత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలిలో విప్, పరిషత్ ఎన్నికల్లో జనగామ, యాదాద్రి జిల్లాల ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి. ములుగు, జయశంకర్ భూపాలపల్లి పరిశీలకుడు, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ తదితరులతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో పార్టీ పట్ల, సీఎం కేసీఆర్‌పై వెల్లువలా ప్రజాభిమానం ఉన్న నేపథ్యంలో పార్టీ నాయకులు మరింత బాధ్యతగా పనిచేయాలని కోరారు.

ఉమ్మడి జిల్లాలోని అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని, ఆరు జెడ్పీల్లో గులాబీ జెండా ఎగురవేయాలని, అందుకోసం పరిశీలకులు క్రియా శీలకంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పరిశీలకుల్ని నియమించుకోవడం, అందరూ వారి వారి నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్ని సమన్వయం చేసే బాధ్యతల్లో తలమునకయ్యారని, అయితే ఇది మరింత స్ఫూర్తివంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. నియోజకవర్గం, మండల స్థాయి పార్టీ పరిశీలకులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పార్టీ కోసం కృషి చేస్తూ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి, సమర్ధత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కృషి చేయాలని కోరారు. ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారు, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...