కల్తీ మాల్..!


Sat,February 23, 2019 02:23 AM

-నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తినుబండారాల తయారీ
-చిన్నారులను ఆకర్షించేలా కలర్ కవర్లతో ప్యాకింగ్
-కిరాణా షాపుల్లో, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు
- కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలవుతున్న బాలలు
-పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారులు
కృష్ణకాలనీ: కిరాణా దుకాణాల ముందు రంగు రంగుల ప్యాకెట్లలో.. చూస్తేనే తినాలపించేలా పలు రకాల చిప్స్ ప్యాకెట్లు కనిపిస్తాయి. వాటిలో ఉండే వస్తువులు కంటికి కొత్తగా కనిపించినా.. లేదంటే వాటిని తోటివారు తింటున్నా.. చిన్న పిల్లలు వెంటనే వాటికి ఆకర్షితులవుతారు. అదే అదనుగా భావిస్తున్న కొంతమంది వ్యాపారస్తులు ఆకర్షనీయమైన కవర్లలో తిను బండారాలను పెట్టి పట్టణాల నుంచి గ్రామాల్లో ఉండే మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ప్రధానంగా విద్యా సంస్థలు, అంగన్ దగ్గర, చౌరస్తాలలో వెలుస్తున్న కిరాణ దుకాణాల్లో ఈ రంగు రంగుల ప్యాకెట్లు అందుబాటులో ఉండడంతో.. పురుగులు వచ్చినా, కాల పరిమితి దాటిపోయినా, వాటిని సరి చూసుకోకుండా, వాటి నాణ్యతను కూడా పరిశీలించకుండా లాభార్జనే ధ్యేయంగా దుకాణదారులు చిన్న పిల్లలకు విక్రయిస్తున్నారు. వాటిని తిన్న చిన్న పిల్లలు తమ తల్లి వండిపెట్టే భోజనాన్ని కూడా తినడానికి ఇష్టపడకపోవడమే కాకుండా రోజూ ఆ కవర్లలోని తిను బండారాలకు అలవాటు పడిపోతున్నారు.

తద్వారా చిన్న పిల్లలకు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వచ్చి ఆస్పత్రుల పాలవుతున్నారు. అదేవిధంగా రంగు రంగుల ప్యాకెట్లలో ఉండే తినుబండారాల తయారీలో.. ఎలాంటి గుర్తింపు లేని నూనెలను మార్చి మార్చి ఉపయోగిస్తున్నారు. చిప్స్, మిక్చర్, మూంగ్ దాల్, బఠానీ, పాపుడం లాంటి పదార్థాలను తయారు చేసి వాటికి చాట్ వేసి రుచిని జోడించి రంగురంగుల ప్లాస్టిక్ కవర్లలో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అవి తయారు చేసిన సమయం నుంచి.. పెద్ద మార్కెట్ల నుంచి చిన్నా చితకా కిరాణ దుకాణాలకు పోయేసరికి వాటి కాల పరిమితి చెల్లిపోతుంది. అయినప్పటికీ వ్యాపారస్తులు లాభాపేక్షతో ఏమీ తెలియని చిన్నారులకు దర్జాగా అమ్మేస్తున్నారు. వాటిని కొనుగోలు చేసిన చిన్నారులకు దాని కాల పరిమితి గురించి తెలియక తిని అనేక రకాల రోగాలను చిన్న వయస్సులోనే కొని తెచ్చుకుంటున్నారు.

పట్టించుకోని ఫుడ్ అధికారులు
నాసిరకంగా తయారు చేసిన పదార్థాలు, కాల పరిమితి చెల్లిన రంగు రంగుల ప్యాకెట్లలో ఉండే తినుబండారాలు కిరాణ షాపుల ద్వారా పిల్లలు విక్రయిస్తున్నా.. ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఫుడ్ అధికారులు స్పందించి ఇలాంటి నాసిరకం, కాల పరిమితి చెల్లిన పదార్థాలను విక్రయిస్తున్న షాపులపై దాడులు చేపట్టి వాటిని మార్కెట్లోకి రాకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

312
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...