లోక్ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్


Sat,February 23, 2019 02:21 AM

-గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు
-వారం రోజుల పాటు జరగనున్న పరిశీలన
-పర్యవేక్షించిన ములుగు ఆర్డీవో రమాదేవి
కృష్ణకాలనీ, ఫిబ్రవరి 09 : లోక్ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలో గల అంబేద్కర్ స్టేడియంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారులు ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలనను నిర్వహించారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్ గల స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. త్వరలో లోక్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారులు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూం నుంచి ఈవీఎంలను బయటకు తీసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజినీర్లతో వాటి పనితీరును పరిశీలించి మళ్లీ స్ట్రాంగ్ రూంలో పోలీసు బందోబస్తు మధ్య భద్రపరిచారు. ఈ సందర్భంగా 679 బ్యాలెన్సింగ్ యూనిట్లను, 675 కంట్రోలర్ యూనిట్లను, 716 వీవీ ప్యాట్ యంత్రాలను పరిశీలించారు.

కాగా, అందులో 670 బ్యాలెన్సింగ్ యూనిట్లు, 666 కంట్రోలింగ్ యూనిట్లు, 695 వీవీ ప్యాట్ యంత్రాలు మాత్రమే సమర్థవంతంగా పని చేశాయి. ఈ సందర్భంగా ములుగు ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ.. రానున్న లోక్ ఎన్నికల్లో ఉపయోగించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఈఎల్ ఇంజినీర్లతో ఈవీఎంలలో అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను, అభ్యర్థుల గుర్తులను తొలగించి ఫస్ట్ లెవల్ చెకింగ్ నిర్వహించామని తెలిపారు. ఫస్ట్ లెవల్ చెకింగ్ మరో వారం రోజులు కొనసాగుతుందని, రోజువారీగా ఈవీఎంల పనితీరును పరిశీలిస్తూ సాయంకాలం స్ట్రాంగ్ రూంలో యథావిధిగా భద్రపరుస్తామని చెప్పారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి పంపిస్తామని ఆర్డీవో రమాదేవి అన్నారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కలెక్టర్ కార్యాలయం ఏవో మహేష్ ము లుగు తహసీల్దార్ ఘనియా, ఈవీఎంల నిర్వహణ సహా య నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, స్థానిక సీఐ వేణు, ఈడీఎం శ్రీకాంత్, ఎలక్షన్ డీటీ నరేశ్, టీఆర్ ప్రతినిధి సాంబమూర్తి, కాంగ్రెస్ నుంచి వెంకటనారాయణ, బీజేపీ నుంచి రాజేందర్, సీపీఐ నుంచి వెంకటేశ్, సీపీ ఎం నుంచి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

188
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...