ఫలించిన పదేళ్ల కల


Thu,February 21, 2019 03:10 AM

-నేటి నుంచి ఉప్పల్‌లో ఆగనున్న కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
-ప్రయాణికులతో రైల్వే స్టేషన్‌కు కళ
-మంత్రి, ఎంపీల కృషికి ఫలితం
కమలాపూర్ : ప్రయాణికుల కల పదేళ్లకు సాకారం అవుతుండడంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో ఈ నెల 21 నుంచి సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్ నిలిపేందుకు రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాజీపేట-డిల్లీ ప్రధాన రైలు మార్గంలో సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్‌కు నడుస్తూ ఉండేది. 2009 నుంచి సమైక్యాంధ్ర పాలనలో ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఆపాలనే డిమాండ్ ప్రజల నుంచి వచ్చింది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నిలుపాలని అప్పటి ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, విద్యార్థులు చాలా సార్లు వినతి పత్రం ఇచ్చినా రైలు నిలుపడంలో విఫలమయ్యారు. పొన్నం ప్రభాకర్ రైల్వే బోర్డు మెంబర్‌గా ఉన్నప్పటికీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను ఆపలేకపోయారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 2014లో తెలంగాణ రాష్ట్ర అవిర్భావంతో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కాస్తా పేరు మారి సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌గా మారింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రజల కలను మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్‌లు ప్రయాణికుల కోరిక నేరవేర్చారు.
మంత్రి, ఎంపీల కృషి
ఉప్పల్ రైల్వేస్టేషన్‌కు వరంగల్ రూరల్, అర్బన్, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్ జిల్లాల నుంచి ప్రయాణికులు వస్తుంటారు. హుజురాబాద్-పర్కాల ప్రధాన మార్గంలో ఉప్పల్ రైల్వే స్టేషన్ ఉండడంతో సింగరేణి ప్రాంతాలైన రామగుండం, గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, రవీంద్రఖని, సిర్పూర్ కాగజ్‌నగర్, మహారాష్ట్ర, కాజీపేట, సికింద్రాబాద్ వెళ్లేందుకు ప్రయాణికులు ఉప్పల్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేస్తుంటారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, విద్యార్థులు పలుమార్లు వినతి పత్రాలు అందజేశారు. స్పందించిన ఎంపీ వినోద్‌కుమార్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేందుకు పలుమార్లు సికింద్రాబాద్ రైల్వే మేనేజర్‌కు విన్నవించారు. అయినప్పటికీ ఉప్పల్‌లో ఫ్లాట్ ఫాం సరిగా లేదని రైల్వే అధికారులు కాలయాపన చేశారు. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈనెల 21న ఉప్పల్‌లో కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆపేందుకు చొరవ తీసుకోవడంతో రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రయాణికులతో రైల్వే స్టేషన్ కిటకిట
ఉప్పల్‌లో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్, రామగిరి ప్యాసింజర్, సింగరేణి ప్యాసింజర్, అజ్నీ ప్యాసింజర్ రైళ్లు నిలుపుతుండడంతో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నది. సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు నేటి నుంచి ఆగుతుండడంతో ప్రయాణికుల రద్దీ మరింత పెరగనుంది. పదేళ్లుగా ఎదురు చూస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో నిలిపేందుకు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్‌కు ఉద్యోగులు, వ్యా పారులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...