వరాల వాన..


Sat,September 22, 2018 01:56 AM

వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ : నిన్నటి వరకు మబ్బులు చాటేసిన వానలు గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు కురువడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వానా కాలం మొదలైన మొదట్లో మురిపించిన వానలు ఆతర్వాత ముఖం చాటేశాయి. దీంతో వరితో పాటు పత్తి, మొక్కజొన్న పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. జిల్లాలో దాదాపు రైతులందరూ ఒకానొక దశలో పంటలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 80 వేల ఎకరాల్లో పత్తి, 40 వేల ఎకరాల్లో వరి, 19 వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. అయితే గతనెల రోజులుగా వర్షం పడలేదు. దీంతో మొక్క జొన్నకు పూర్తిగా నష్టం జరిగింది. ఇక పత్తి పంట ఎదుగుదల పూర్తిగా లోపించింది. వర్షాలను నమ్ముకుని రైతులు నాట్లు వేశారు. అయితే కొద్ది రోజులుగా వానలు పడక పోవడంతో అన్ని పంటలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ తరుణంలో గురువారం రాత్రి నుంచి పడుతున్న ముసురుతో రైతులకు కొంత మేర ఉపశమనం కలిగింది. అల్పపీడనం వల్ల జిల్లాలోని అన్ని మండలాల్లో వాన పడడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజులు ఈ వర్షాలు పడే అవకాశముందనే సమాచారంతో రైతులు ఆసక్తిగా చూస్తున్నారు. ముసురుతో కూడిన వర్షం పడడంతో పంటలపై మళ్లీ రైతుల ఆశలు చిగురించాయి. రైతులు ఎరువుల దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు. మొత్తానికైతే కరువు కాలంలో పడిన వానతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది.

జలమయమైన హన్మకొండ బస్‌స్టేషన్..!
సుబేదారి: వర్షంనీటితో హన్మకొండ బస్‌స్టేషన్ జలమాయమైంది. బాలసముద్రం బస్‌స్టేషన్ ఆవరణం లోతట్టు ప్రాంతం కావడంతో ఎగువ ప్రాంతాలనుంచి వర్షపు నీరు లోపలికి రావడంతో బస్‌స్టేషన్ నిండిపోయింది. దీంతో బస్సుల రాకపోకలకు అతంరాయం ఏర్పడింది. శుక్రవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం పడడంతో బాలముద్రం బస్‌స్టేషన్ కూడలి- పబ్లిక్‌గార్డెన్ రోడ్డు, అలాగే బాలసముద్రం -అదాలత్‌వైపు వెళ్లే రోడ్డు మార్గం, హన్మకొండ చౌరస్తా ప్రభుత్వం జూనియర్ కళాశాలనుంచి బస్‌స్టేషన్ వైపు వచ్చే రోడ్లన్నీ చెరువులను తలపించాయి.
మరోవైపు 37వ డివిజన్‌లోని లోతట్టు ప్రాంతాలైన నాగేంద్రనగర్, ప్రగతినగర్, ఆదర్శకాలనీ, జూలైవాడ, పోస్టల్‌కాలనీ ప్రధాన రోడ్లన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. వర్షం కారణంగా రెవెన్యూకాలనీ- జూలైవాడ ఆటో అడ్డ ప్రధాన రోడ్డు నిర్మాణంలో ఉన్నందున నీటి గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే 48వ డివిజన్ లోతట్టు ప్రాంతమైన హౌసింగ్ బోర్డుకాలనీ వర్షపు నీటితో జలమయమైంది. కాలనీ రోడ్లు, డ్రైనేజి కాలువలు నీటితో నిండిపోయాయి.

చెరువులను తలపించిన నగర రోడ్లు..
రెడ్డికాలనీ: శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లు నీటితో నిండిపోయాయి. హన్మకొండ చౌరస్తా మూలమలుపు, బస్టాండ్ వద్ద నీళ్లు నిలిచిపోయాయి. కాకాజీకాలనీలో ఏర్పడిన గుంతల్లో నీళ్లు నిలిచి బురదమయంగా మారాయి. మున్సిపల్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

మడికొండలో..
మడికొండ: మడికొండలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మడికొండతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వర్షం పడి ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండాయి. వర్షం నీరుతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో రోడ్లన్నీ బురదమయంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురయ్యారు.

నారాయణగిరిలో వర్షానికి కూలిన ఇల్లు
ధర్మసాగర్ : గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో శుక్రవారం నారాయణగిరిలో ములుకుంట్ల ఐలయ్యకు చెందిన పెంకుంటిల్లు కూలిపోయినట్లు బాధితుడు తెలిపారు. బాధిత కుటుంబాన్ని గ్రామానికి చెందిన రజక సంఘం కమిటీ సభ్యులు పరామర్శించారు. బాధితుడికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలని కోరారు.

271
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...