త్యాగాలకు ప్రతీక మొహర్రం


Sat,September 22, 2018 01:56 AM

ఖిలావరంగల్, సెప్టెంబర్ 21: మొహర్రం అంటే త్యాగాల చరిత్ర.. మొహర్రం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది హసన్, హుస్సేన్‌లు. రాచరిక వ్యవస్థ నిర్మూలనకు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హసన్, హుస్సేన్ మహనీయులు చేసిన కృషి అంతా ఇంతా కాదు. ముస్లింలకే కాదు.. ముస్లిమేతరులకు కూడా ఆ మహానీయుల త్యాగాలు మనసును తట్టిలేపుతాయి. హిందూ ముస్లింల ఐక్యతకు.. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం పర్వదిన వేడుకులను జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు పీరీలకు ప్రత్యేక పార్థనలు చేసిన అనంతరం శుక్రవారం రాత్రి సమీపంలోని చెరువులు, బావుల్లో నిమజ్జనం చేశారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో నిర్వహించిన మొహర్రం వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి అశేష భక్తజనావలి తండోప తండాలుగా తరలి వచ్చారు. మధ్యకోట సదర్‌చౌక్ బక్షిమహాల్‌లోని పీరీల కొట్టాలలో తొమ్మిది రోజులు పీరీలకు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. భక్తులు షర్బత్ (మట్కీలు), ఇతర తినుబండారాలను ఫాతియా (నైవేద్యం) సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. పదోరోజు ఆదివారం సాయంత్రం నమాజ్ తర్వాత సదర్‌చౌక్ నుంచి హుస్సేనీఅలం, హస్సేనీఅలం, పంజతన్, భారీఇమామ్ పీరీలతోపాటు మరో నాలుగు పీరీలను పడమర కోట మీదుగా ఖమ్మం రోడ్డులోని కాకతీయుల చారిత్రక బావి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు పీరీలకు కుడుకల దండలు, పూలమాలలు, ఆకుమాలలు, దట్టీలు కట్టి మొక్కులు చెల్లించుకొన్నారు. తమ పిల్లల ఆయురారోగ్యాలను ఆకాంక్షించి వారిని పీరీలకు తగిలించి ఆశీర్వాదాలు పొందారు. కరీమాబాద్, ఉర్సు, చింతల్, శంభునిపేటలో పీరీలను ఊరేగించారు.

జనసంద్రమైన చారిత్రక ఖిల్లా..
మొహర్రం పర్వదినం సందర్భంగా చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటకు అశేష జనవాహిని తరలివచ్చింది. వివిధ దుకాణాల ఏర్పాటుతో జాతరను తలపించింది. ఏసీపీ ప్రభాకర్‌రావు పర్యవేక్షణలో మిల్స్‌కాలనీ సీఐ పీ దయాకర్, ఎస్సైలు నాగరాజు, డేవిడ్, పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు నడుమ పీరీలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. వివిధ రకాల దట్టీలు, దండలు, కుడక, ఆకుమాలలతో పీరీలను అలంకరించి ప్రార్ధనల అనంతరం కోట ప్రాంతంలో ఊరేగించారు. అనంతరం ఖమ్మం రోడ్డులోని కాకతీయుల చారిత్రక బావి వద్ద పీరీలను దించి నీటితో వస్తువులను శుభ్రపరిచారు. అనంతరం వాటిని పీరీల కొట్టానికి తరలించారు. ఈ సదర్భంగా మలీద, కుడకలు, షర్బత్ తదితర పదార్ధాలను పంచిపెట్టారు.

వేడుకలను ప్రారంభించిన మేయర్
మొహర్రం వేడుకులను వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంలా మతాలకతీతంగా కోటలో అనాదిగా పీరీల పండుగను నిర్వహించుకోవడం సంతోషదాయక మన్నారు. ఖిలా వరంగల్‌లో అషుర్‌ఖానకు రూ.11.5 లక్షల తో నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. వరంగల్ తూర్పు నియోజక వర్గంలో అశుర్ ఖానాలు నిర్మిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ముస్లీం మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. అలాగే ఈ వేడుకలకు మహిళ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, టీఆర్‌ఎస్ నాయకులు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్, టీఆర్‌ఎస్ నాయకులు ఎన్ రమేశ్, బిల్లబిల్ల శ్రీకాంత్, సోమిశెట్టి ప్రవీణ్, మిరిపెల్లి రాజు, మిట్టపెల్లి కట్టమల్లు, కాసుల ప్రతాప్‌తోపాటు అషుర్‌ఖాన హుస్సైని ఆలం యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ షఫీ, కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.

338
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...