వెలుగులు నింపడమే లక్ష్యంగా..


Tue,September 18, 2018 03:40 AM

-కొనసాగుతున్న కంటి వెలుగు
-84,697 మందికి కంటి పరీక్షలు
-402 మందికి శస్త్రచికిత్సలు
రెడ్డికాలనీ, సెప్టెంబర్ 17: చూపు సమస్యతో బాధపడుతున్న వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు తేవటమే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా ప్రజలందరికీ కంటి స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉచితంగా కంటి అద్దాలను సమకూర్చడంతో పాటు సర్జరీలు, ఇతర చికిత్సలను ఉచితంగా చేస్తుండటంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జిల్లావ్యాప్తంగా 23 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సుమారు 16 మందితో కూడిన సిబ్బంది కేటాయించిన శిబిరాల్లో ప్రతిరోజూ సుమారు 300 మందికిపైగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే సాధారణ కంటి వ్యాధులకు మందులను అందిస్తారు. హానికరమైన కంటి వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఉచితంగా మందులు, కళ్లద్దాలు ఇవ్వనున్నారు.

84,697 మందికి కంటి పరీక్షలు
ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 84,697 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అక్కడే 22,215 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఇంకా 25,306 మందికి అద్దాలు ఇవ్వాల్సి ఉంది. ఆపరేషన్లు, ఇతర సమస్యల కోసం 9888 మందిని రెఫర్ చేసినట్లు, ఇప్పటి వరకు 402 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ బీ హరీశ్‌రాజ్ తెలిపారు.

19తో ముగుస్తున్న పెద్దమ్మగడ్డ శిబిరం
- క్యాంపు మెడికల్ ఆఫీసర్ విజయరెడ్డి
పెద్దమ్మగడ్డలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరం ఈనెల 19తో ముగుస్తుంది. ప్రతి ఒక్కరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పటి వరకు రానివారు ఇతర క్యాంపుల్లో సైతం వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చు. చిన్నపిల్లలకు కంటి పరీక్షలు చేయించేందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ కంటి స్క్రీనింగ్ చేయించుకోవచ్చు. ఉచితంగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో మందులు పంపిణీ చేస్తున్నట్లు, కంటి చూపు సమస్య ఉన్నవారికి ఇక్కడే ఉచితంగా కంటి అద్దాలు అందిస్తున్నాం. శస్త్రచికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నాం.

198
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...