వినాయక విగ్రహాలకు జియోట్యాగింగ్


Tue,September 18, 2018 03:38 AM

-కమిషనరేట్ పరిధిలో 4,571 విగ్రహాలకు భద్రత
-పోలీస్‌స్టేషన్ల వారీగా సమాచార సేకరణ
-సీపీ డాక్టర్ రవీందర్
నయీంనగర్, సెప్టెంబర్ 17: టెక్నాలజీ సహాయంతో కమిషనరేట్ పరిధిలో ఉన్న గణపతి విగ్రహాల భద్రతను పర్యవేక్షించనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరాలను నియంత్రించడం తో పాటు, నేరస్తులను క్షణాల్లో గుర్తించనున్నట్లు చెప్పారు. తొలిసారిగా టెక్నాలజీ ఆధారంగా విగ్రహాలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించబోతున్నామన్నారు. కమిషనరేట్ పరిధిలో 4.571 విగ్రహాలను ఏర్పాటు చేయగా సెంట్రల్ జోన్ పరిధిలో 1900, ఈస్ట్‌జోన్ పరిధిలో 1468, వెస్ట్‌జోన్ పరిధిలో 1203 విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆయా మండపాల్లోని విగ్రహాల సమాచారం సులభంగా గుర్తించేందుకు పోలీస్‌స్టేషన్ల వారీగా ఏర్పాటు చేసిన విగ్రహాలను జియోట్యాగింగ్ ద్వారా గూగుల్ మ్యాపునకు అనుసంధానం చేయనున్నట్లు సీపీ వివరించారు. జియోట్యాగింగ్ చేసేందుకు పోలీస్ అధికారులు, బ్లూకోల్ట్స్ సిబ్బంది, పెట్రోలింగ్ సిబ్బంది విగ్రహాలకు వద్దకు వెళ్లి నెలకొల్పబడిన ప్రదేశం, ఏర్పాటు చేసిన వ్యక్తుల వివరాలు, ఫోన్ నంబర్లతో సహా సేకరించి అక్కడి నుంచే సిబ్బంది చేతిలో ఉన్న ట్యాబ్‌లో జియోట్యాగింగ్ చేయనున్నట్లు చెప్పారు. జియోట్యాగింగ్ చేసిన విగ్రహాలను గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించడం సులభమవుతుందని, తద్వారా పట్టిష్టమైన భద్రత ఏర్పాట్లను పోలీసులు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ సమాచారంతో భవిష్యత్‌లో వినాయక విగ్రహాలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడానికి ఉపయోగపడుతుందని సిపి పేర్కొన్నారు.

215
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...