జోరుమీదున్న గులాబీ


Thu,September 13, 2018 02:11 AM

-ఊరూరా టీఆర్‌ఎస్ అభ్యర్థులకే ఓటువేస్తామని ప్రతిజ్ఞలు
-ర్యాలీలు , మార్నింగ్ వాకర్స్‌తో విస్తృత ప్రచారం
-ఒకవైపు వ్యూహరచన మరోవైపు కార్యాచరణ
-ఇంకా సర్దుకోని విపక్షాలు
-టీఆర్‌ఎస్ వ్యూహంతో బెంబేలెత్తుతున్న పార్టీలు
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ:
నిజానికి అనూహ్య పరిణామమే. మునుపెన్నడూ లేనివిధంగా టీఆర్‌ఎస్ ప్రజల్లోకి దూసుకెళుతుంది. అభ్యర్థుల ప్రకటన నుంచే టీఆర్‌ఎస్ ప్రచారం మొదలుపెట్టింది. సహజంగా అభ్యర్థులు వచ్చి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, తన హయాంలో చేసిన పని ఇది అని చెప్పుకోవడం పరిపాటి. అయితే ఈసారి అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, హుస్నాబా ద్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇంకా పూర్తిస్థాయి ప్రచారానికి దిగకపోయినా ఆయా నియోజకవర్గాల్లో తాజామాజీ ఎమ్మెల్యేల అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు వారి ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై, ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకర్గంలోని కమలాపూర్ మండలంలో కుల సంఘాలు అనూహ్యం గా మద్దతు పలుకుతున్నాయి.

తమ ఓటు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్‌కే వేస్తామని ఊరి చావట్లోకి వచ్చి ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇక వరంగల్ తూర్పు నియోజకర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ ఆశావహులు తమలో టికెట్ ఎవరికి వచ్చినా ఫర్వాలేదు.., కలిసికట్టుగా పనిచేసి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వాకర్స్ దగ్గరికి, మార్కెట్ యార్డ్‌లకు వెళ్లి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. వరంగల్ పశ్చిమ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ పూర్తిస్థాయిలో ప్రచారం ప్రారంభించకపోయినా గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని డివిజన్లలోని ముఖ్యనాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు క్యూ కడుతున్నారు. విపక్షాలకు విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం, వారంతా ప్రజలతో మమేకమై ప్రచార పర్వంలోకి దూసుకెళ్తుంటే తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నాయి.

గులాబీ ద్విముఖ వ్యూహం
టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా ద్విముఖ వ్యూహాన్ని ఖరారు చేసింది. ఎన్నికల్లో మిగితా పార్టీలు కనీసం దరిదాపుల్లోకి కూడా రాని పరిస్థితిని టీఆర్‌ఎస్ ముందే కట్టడి చేసింది. సింగిల్ స్ట్రోక్‌లో సిట్టింగ్ అభ్యర్థులను ప్రకటించి అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇదే ఊపుతో ప్రచారంలో పరుగులు పెట్టాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నిపార్టీలను కట్టడి చేస్తూ ప్రచారంలోకి గులాబీ శ్రేణులు వెళ్లిపోయాయి. నియోజకవర్గాల్లో ఈ నాలుగున్నర సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను లబ్ధిపొందిన వర్గాలతో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నది. అదే సమయంలో ఓటర్ సమూహాలను కలిసేందుకు ప్రత్యేక బృందాలను ఎంపిక చేసి అభ్యర్థులు ముందుకుసాగుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని కీ ఓటర్లను కలుస్తూ వారి ద్వారా వారి ప్రాంతాల్లో తటస్తులుగా ఉండే వారిని ఏకం చేసి ముందుకు సాగే వ్యూహాన్ని ఎంచుకుంది. ఉదయం నుంచి సాయ ంత్రం వరకూ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించడం, సాయంత్రం మరునాటికి అనుసరించాల్సిన అంశం పై వ్యూహ రచన చేసుకోవడం అనే ప్రక్రియ పోలింగ్ సమ యం వరకు కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గత సాధారణ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓట్లు వచ్చిన ప్రాంతాలపై ఎంత దృష్టి సారించారో ప్రతికూలంగా వచ్చిన ప్రాంతాల్లో అంతకురెట్టింపు కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.

ఊరూరా ప్రతిజ్ఞలు
టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత 2004లో వచ్చిన సాధారణ ఎన్నికల సమయంలో ఏ స్థాయిలో గెలుపు పట్టుదలతో ప్రజలున్నారో అదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తున్నది. అయితే ఈసారి నియోజకవర్గాల్లో ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఎన్నికలు రేపేనా అన్న వాతావరణం నెలకొన్నది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటి కన్నా ముందే నియోజకవర్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే అభ్యర్థుల ఆలోచనలకు ఆయా నియోజకవర్గాల ప్రజలు తోడై నిలుస్తున్నారు. దీనికి నాలుగైదు రోజులుగా నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులే స్పష్టం చేస్తుంది. ఊరూరా ప్రజ లు, ప్రత్యేకించి ఈ నాలుగున్నర ఏండ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో లబ్ధి పొందిన ఆయా కులా లు గతంలో ఎన్నడూలేని స్ఫూర్తిని రగిలిస్తున్నాయి.

ఊర్లకు ఊర్లు, సంఘాలకు సంఘాలు ఇప్పుడే తమ ఓటు టీఆర్‌ఎస్ అభ్యర్థికి వేస్తామని ప్రకటిస్తున్నారు. కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, దేశాయిపేట, పెగడపల్లి వంటి ప్రాంతాల్లో తమ ఓటు టీఆర్‌ఎస్ అభ్యర్థికనంటూ బాహాటంగా ప్రకటించారు. ఎప్పుడైనా అభ్యర్థులు వెళ్లి ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశమై, వారికి వాగ్దానాలు చేసి అనంతరం వారికి నచ్చితే తమ మద్దతు ఉంటుందని పత్రిక ప్రకటన విడుదల చేసే ఆనవాయితీ ఉండేది. కానీ ఈసారి అందుకు విరుద్ధమైన వాతావరణం నెలకొన్నది. ఇలా ప్రకటించడం అనే ప్రక్రియ ఇటీవలి కాలం లో ఎన్నడూ చూడలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాదు ఇది ఆహ్వానించదగిన పరిణామం అని పేరు చెప్పడానికి నిరాకరించిన కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.

గులాబీ గూటికి క్యూ
ప్రగతికాముక పార్టీగానే కాకుండా రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీగా టీఆర్‌ఎస్‌ను అంద రూ భావిస్తుండటంతో కాంగ్రెస్ సహా అన్ని పార్టీల్లో సుధీర్ఘకాలం పనిచేసిన శ్రేణులన్నీ టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. నన్ను కోసినా నేను కాంగ్రెస్ నాయకుడిగానే ఉంటానని తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రకటించిన అనేక మంది నియోజకర్గస్థాయి ముఖ్యనేతలు టీఆర్‌ఎస్ తీర్థ పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రాజనాల శ్రీహరి లాంటివాడు నేడో రేపో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో ఆయన మంతనాలు జరిపారు.

హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. హుస్నాబాద్‌లో తాజామాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ నేతృత్వంలో వందలాది మంది కాంగ్రెస్ పార్టీకి రాం రాం పలికి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. వర్ధన్నపేట నియోజకర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో అనేక మంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకర్గంలో ఉన్న ఒక్క కాంగ్రెస్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సీపీఐకి చెందిన ముఖ్యనాయకులు, ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు నేడో రేపో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మొత్తం మీద దేశం గర్వించే స్థాయిలో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని చేరికలే కాదు రేపు గెలుపు అదేస్థాయిలో ఉంటుందనే ధీమా ప్రజల్లో వ్యక్తం అవుతోండటం విశేషం.

268
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...