జై జై గణేశా..!


Thu,September 13, 2018 02:09 AM

- నేడు వినాయక చవితి
- కొలువుదీరనున్న గణనాథులు
- ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీ
-వాడ వాడలా మంటపాలు
- విద్యుత్ కాంతుల్లో నగరం
- ముస్తాబైన రుద్రేశ్వరాలయం
- జోరుగా పత్రుల అమ్మకాలు
వరంగల్ కల్చరల్/ న్యూశాయంపేట/వరంగల్ చౌరస్తా/మట్టెవాడ: జై గణేశా.. జైజై గణేశా... గణపతి పప్పా మోరియా... అంటూ నగరం మార్మోగింది. సకల దేవతా గణములకు అధిపతియైన గణనాయకుడుని కొలువు దీర్చేందుకు పురవీధుల్లో ఊరేగింపుగా తరలిస్తుండటంతో నగరంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. వినాయకుడి జన్మదినమైన భాద్రపద శుద్ధ చవితిని పురస్కరించుకొని గురువారం వినాయక చవితి పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. మట్టి విగ్రహాలనే పూజిద్దాం.. పర్యవరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఈ యేడు పెద్ద ఎత్తున మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకే భక్తులు సన్నద్ధమయ్యారు.
వాడ వాడల మండపాలు
నగరంలోని ప్రధాన కూడళ్లు, కాలనీలు, అపార్ట్‌మెంట్స్, కళాశాలలు, హాస్టళ్లు, ఆలయాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్టింపజేసేందుకు వారం రోజుల నుంచే పనులు చేపట్టారు. విద్యుత్ కాంతులతో మంటపాలను తీర్చిదిద్దారు. రుద్రేశ్వర సేవాసమితి ఆధ్వర్యంలో వెయ్యి స్తంభాల దేవాలయంలో నవరాత్రోత్సవాలను నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.
ముస్తాబైన ఆలయాలు...
నవరాత్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నగరంలోని పలు గణపతి ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. కాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి ఆలయం, రైల్వే క్వార్టర్స్‌లో, హన్మకొండ సహకార నగర్‌లో, ఎక్సైజ్ కాలనీలో, ములుగు రోడ్‌లోని దత్తక్షేత్రం, భద్రకాళి దేవస్థానంలో, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని రత్నగర్భ గణపతి ఆలయాల్లో గణపతి నవరాత్రోత్సవాలు నేత్ర పర్వంగా నిర్వహించేందుకు ఆయా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
మంటపాలకు కదిలిన గణనాథులు..
తొమ్మిది రోజులు పూజలందుకునే గణనాథులను ప్రతిష్టించేందుకు ఆ యా ఉత్సవ కమిటీలు గణనాథులను హైదరాబాద్, వరంగల్ జిల్లా కేంద్రం నుంచి తీసుకెళ్తుండటంతో నగరం శోభాయమానంగా మారింది.

మట్టి విగ్రహాల పంపిణీ
నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి. భారీ విగ్రహాలను మంటపాల్లో ప్రతిష్టించేందుకు కమిటీల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
పాఠశాలల్లో పర్వదిన వేడుకలు
జిల్లాలోని పలు ప్రభుత్వ,ప్రవేట్ పాఠశాలల్లో బుధవారం వినాయక చవితి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులతోనే స్వయంగా మట్టి విగ్రహాలను తయారు చేయించి ప్రతిష్టింపజేశారు. ఆయా పాఠశాలల్లో ఒకరోజు ముందుగానే పండుగ వాతావరణం నెలకొంది.
ముస్తాబైన రుద్రేశ్వరాలయం
చారిత్రక వెయ్యి స్తంభాల రుద్రేశ్వరాలయం గణపతి న వరాత్రోత్సవాలకు ఆలయం ముస్తాబైంది. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించనున్నారు. ఉత్తిష్ట గణపతికి పంచామృతాభిషేకం, గరిక పూజ నిర్వహించి వరసిద్ధి వినాయకుడుగా అలంకరించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉత్సవ విగ్రహాన్ని హన్మకొండ చౌరస్తా నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించనున్నారు. ఎంపీ బండా ప్రకాశ్, తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఉత్సవాలను ప్రారంభించనున్నారు.
జోరుగా పత్రుల అమ్మకాలు..
వినాయకుడిని పూజించేందుకు మారేడు, వెలగ, గరిక, ఉత్తరేణి, తుమ్మి, ఉమ్మెత్త, తులసీ, దానిమ్మ, జాజి, జిల్లేడు, సీతాఫలం, జమ్మి, విష్ణు కాంత, వావిలి, రావి, దానిమ్మ, జాజిమల్లి, మద్ది, దేవదారు వంటి 21 రకాల పత్రులు ఉపయోగిస్తారు. ట్రైసిటీస్‌లో పలువురు విక్రయదార్లు గ్రామాలనుంచి పత్రులతో పాటు బంతి, చామంతి పూల అమ్మకాలు చేపట్టారు. చిన్న వినాయక ప్రతిమలు, పాలవెళ్లులను కూడా తయారు చేసి అమ్మడంతో కొనుగోలుదార్లతో ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోయి సందడిగా మారాయి.

217
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...