టీఆర్‌ఎస్ విజయం ఖాయం


Thu,September 13, 2018 02:08 AM

-కార్యకర్తలు సైనికుల్లా ముందుకెళ్లాలి
-నియోజకవర్గ అభివృద్ధికి రూ. 4,800 కోట్లు
-పల్లె బాటతో గ్రామాల్లో పర్యటిస్తా..
-తాజా మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్
-హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయికార్యకర్తల సమావేశం
వరంగల్ సబర్బన్, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్ నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని తాజా మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హుస్నాబాద్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమరంలో కార్యకర్తలు సైనికుల్లా కదనరంగంలో ప్రచారం నిర్వహించాలన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన 35వేల మెజార్టీని రెట్టింపు చేయాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలకు వందశాతం రోడ్లు వచ్చేలా నిధులు తెచ్చినట్లు ప్రకటించారు. రూ.17కోట్లతో పీఆర్ రోడ్లు, లింకు రోడ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఎల్కతుర్తి నుంచి మెదక్ వరకు రూ.1100కోట్లతో జాతీయ రహదారి మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కృషితో గౌరవెల్లి రిజర్వాయర్‌ను 8.24టీఎంసీలకు పెంచి 1.65లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

మిషన్ భగీరథ పనులు ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పూర్తవగా, మరి కొన్ని గ్రామాల్లో చివరి దశలో ఉన్నాయన్నారు. పాడి రైతులను ప్రోత్సహించి రూ.4 బోనస్ చెల్లించడంతో పాటు 50శాతం సబ్సిడీపై బర్రెలను పంపిణీ చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేన్నారు. హుస్నాబాద్‌లో జరిగిన ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రజలను చైతన్యం చేయడం ఆనందంగా ఉందన్నారు. రెండు మూడు రోజుల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని తెలియజేసేందుకు పల్లెబాట పేరుతో గ్రామాల్లో పర్యటించనున్నట్లు చెపారు. గ్రామస్థాయిలో సమావేశాలు పెట్టి 10మందితో రెండు రోజుల్లో బూత్ కమిటీలు వేయాలని సూచించారు. 100 శాతం పోలింగ్ జరిగేలా ప్రతి కార్యకర్త చూడాలని కోరారు. అందులో 90శాతం ఓట్లు కారుగుర్తుకే పడేలా చూడాలని నిర్దేశించారు.

ఎన్నికలు పూర్తయ్యే వరకు గ్రామానికి కనీసం రెండు సార్లు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో మొత్తం 160 గ్రామాలు ఉండగా ఇందులో సుమారు 320బూత్‌లు ఉంటాయని, బూత్ కమిటీలు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేయాలని సతీశ్‌కుమార్ సూచించారు. ఇందులో 40కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నందున వీటిల్లో వందశాతం కారుగుర్తుకే పడేలా చూడాలన్నారు. ఎక్కువ సంఖ్యలో గ్రామాలను టీఆర్‌ఎస్ గ్రామాలుగా ప్రకటించేలా ప్రజలను సమాయాత్తం చేయాలన్నారు. ఓటరు జాబితాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పిపోయిన వారిని చేర్పించడం, కొత్త ఓటర్లను నమోదు చేయించడంలో కార్యకర్తలు నిమగ్నం కావాలన్నారు. అంతకుముందు కొండగట్టు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారితో పాటు ఇటీవల మృతిచెందిన వారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గంలోని ఆరె కులస్తులందరూ టీఆర్‌ఎస్ అభ్యర్థి సతీశ్‌కుమార్‌కు మద్దతుగా ఉంటారని ఆ సంఘం నాయకులు వేదికపై ప్రకటించారు.

సమన్వయంతో ప్రచారానికి వెళ్లాలి
కార్యకర్తలు, నాయకులు అలకలకు పోకుండా సమన్వయంతో ఉంటూ ఎన్నికల ప్రచారం చేయాలని రాష్ట్ర గొర్రెల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ రాజయ్యయాదవ్ పిలుపునిచ్చారు. ఎదుటి పార్టీ వాళ్లకు అవకాశం ఇవ్వకుండా గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు ఒకే లక్ష్యంతో ముందుకుపోయి రికార్డు మెజార్టీతో సతీశ్‌కుమార్‌ను గెలిపించి రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలన్నారు. మొదటి నుంచి రాజకీయ నేపథ్యం, సేవాభావం కలిగిన కెప్టెన్ కుటుంబం కలంకం లేనిదని, ఆ కుటుంబం నుంచి వచ్చిన సతీశ్‌కుమార్ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ఆయనను గెలిపించే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. సమావేశంలో కరీంనగర్ జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీపీలు భూక్య మంగ, ఉప్పుల స్వామి, సంగ సంపత్, తంగెడ శాలిని, జెడ్పీటీసీలు పొన్నాల లక్ష్మణ్, వీరమల్ల శేఖర్, బిల్ల వెంకట్‌రెడ్డి, రాంచందర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మార్కెట్ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, నాయకులు డాక్టర్ సుధీర్‌కుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు శ్రీపతి రవీందర్ గౌడ్, పోరెడ్డి రవీందర్ రెడ్డి, బచ్చు కిషన్ రావు, మునిగడప శేషగిరి, గొల్లె మహేందర్, జిల్లెల్ల గాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, తంగెడ నగేశ్, వెంకటేశ్ యాదవ్, రాజేశ్వర్ రావు, గుండా ప్రతాప్ రెడ్డి, చిట్టి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

217
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...