ఆరోగ్య తెలంగాణ కోసమే పోషణ్ అభియాన్


Wed,September 12, 2018 03:09 AM

హసన్‌పర్తి, సెప్టెంబర్ 10: ఆరోగ్య తెలంగాణ కోసమే ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఐసీడీఎస్ సీడీపీవో సులోచన అన్నారు. మండల కేంద్రంలోని విజయ గార్డెన్స్‌లో ఐసీడీఎస్ ప్రాజెక్టు భీమదేవరపల్లి ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటికి పోషణ్ అభియాన్ సంబురాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని 78 సెంటర్లకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు వివిధ రకాల పదార్థాలతో తయారు చేసిన పోషకాహార ప్రదర్శనను నిర్వహించారు. ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీపీవో సులోచన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రతీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇంటింటికీ పోషణ సంబురాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీసుకునే పోషకాహారంపై అంగన్‌వాడీ కార్యకర్తలు చార్టు ద్వారా తెలిపే విధంగా కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రతీ బిడ్డ వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు, లావు ఉండేలా తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు.

వ్యవసాయంలో పైరును రైతు ఎలా చూసుకుంటాడో ప్రతీ తల్లి తమ పిల్లల పోష ణను కూడా అలాగే బాధ్యతగా చూసుకోవాలన్నారు. హసన్‌పర్తి పరిధిలోని అంగన్‌వాడీ సెంటర్లలో 1160 మంది మూడు సంవత్సరాల లోపు పిల్లలు, 677 మంది 3 నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లలు, 169 మంది గర్భిణులు, 139 మంది బాలింతలున్నారని తెలిపారు. అలాగే భీమారం పరిధిలో1313 మంది మూడు సంవత్సరాలలోపు పిల్లలు, 824 మంది 3 నుంచి 6 సంవత్సరాలు, 373 మంది గర్భిణులు, 173 మంది బాలింతలున్నారు. నాగారం సెక్టారు పరిధిలో 1006 మంది 3 సంవత్సరాలలోపు పిల్లలు, 573 మంది 3 నుంచి 6 సంవత్సరాలు, 262 మంది గర్భిణులు, 99 మంది బాలింతలుగా నమోదైనట్లు తెలిపారు. నెల రోజుల పాటు ప్రతీ ఇంట్లో ఉన్న గర్భిణులు, బాలింతలు, పిల్లలను కలిసి పోషకాహారంపై అవగాహన కల్పించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు అనంతలక్ష్మి, స్వరూప, టీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు వల్లాల యాదగిరి, నాయకులు చకిలం రాజేశ్వర్‌రావు, గౌరిశెట్టి సత్యనారాయణలతో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అర్బన్ కలెక్టరేట్: పోషణ అభియాన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోడి మంగళవారం దూరదర్శన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారని జిల్లా సంక్షేమాధికారి ఈ శైలజకుమారి తెలిపారు. ఉదయం 10.30గంటల నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో పీఎం మాట్లాడుతూ.. తల్లులు, శిశువులకు వివిధ రాష్ర్టాలలో అందిస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారన్నారు. రక్తహీనత, తక్కువ బరువుపై ప్రత్యేక దృష్టి పెట్టి విధులు నిర్వహణను క్షేత్ర స్థాయిలో సక్రమంగా నిర్వహించాలని అన్నారన్నారు. మాతృ, శిశు మరణాలను నివారించుట, రక్తహీనతను తగ్గించడంపై ప్రత్యేక శ్రద్ధ్ద చూపిస్తే మీరు చేస్తున్న సేవలు సమాజంలో గణనీయమైన మార్పును తెచ్చే వీలుంటుందని అన్నారని తెలిపారు. ఐసీడీఎస్-సీఏఎస్ ద్వారా సమాచార సేకరణ చేయడం ప్రశంసనీయమని అన్నట్లు శైలజకుమారి అన్నారు. ఇలా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న సేవలపై పూర్తి స్థాయిలో చర్చించారని తెలిపారు. అయితే అంగన్‌వాడీ టీచర్లకు వేతనం పెంచుతున్నామని, వచ్చే దీపావళి కానుకగా అక్టోబర్ ఒకటి నుంచి వర్తింపచేయడం జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారన్నారు. అంగన్ వాడీ, ఆశ, ఏఎన్‌ఎం ట్రిపుల్ ఎలు ఎ గ్రేడ్ భారత్ కావాలని పీఎం ఉద్బోదించినట్లు ఆమె తెలిపారు.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...