-24 వరకు నమోదు గడువు, 15,16 తేదీల్లో ప్రచారం
-కమిషనర్ వీపీ గౌతమ్
వరంగల్,నమస్తేతెలంగాణ: ఓటరుగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం కార్పొరేషన్లో తూర్పు నియోజకవర్గ తహసీల్దార్లు, ఎన్నికల డీటీలతో ఆయన సమావేశమయ్యారు. ఓటరు నమోదు, పోలింగ్ బూతుల పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ గౌతమ్ మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీ వరకు ఓటర్లుగా ఆన్లైన్లో లేదా.., తహసీల్ కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని అన్నారు. రెండు ఫొటోలు, వయస్సు ధ్రువీకరణ కోసం బర్త్ సర్టిఫికెట్, 10వ తరగతి మెమో, చిరునామా కోసం ఏదైనా ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని సూచించారు. ఈనెల 15,16 తేదీల్లో ఓటు నమోదుపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. తూర్పులో 213 పోలింగ్ కేంద్రా లు ఉన్నాయని, అందులో 125 పోలింగ్ కేంద్రాలు ప్రైవేట్ భవనాల్లో ఉన్నట్లు అధికారులు కమిషనర్‌కు వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీటితో పాటు మౌలిక వసతులు ఉండేలాజాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలు మతపరమైన కట్టడాలు, పార్టీల కార్యాలయాలకు 200 మీటర్ల దూరంలో ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. అవసరమైన చోట పోలింగ్ కేంద్రాలను మార్పులు చేయాలన్నారు. తూర్పు నియోజకవర్గంలో 1,89, 209 మంది ఓటర్లుగా నమోదయ్యారని అధికారులు కమిషనర్‌కు విరించా రు. జనాభా నిష్పత్తి ప్రకారం నియోజకరవ్గంలో 24 వేల మంది కొత్త ఓటర్లుగా నమోదు కావాల్సి ఉందని కమిషనర్ గౌతమ్ అన్నారు. సమావేశంలో కార్పొరేషన్ కార్యదర్శి విజయలక్ష్మి, వరంగల్ తహసీల్దార్ రాజేష్, ఖిలావరంగల్ తహసీల్దార్ కిరణ్ కుమార్, డీటీలు శ్రీపాల్ రెడ్డి, రియాజ్ పాల్గొన్నారు.