మామునూర్ ఎయిర్‌పోర్టు ప్రారంభానికి కసరత్తు


Tue,September 11, 2018 02:31 AM

అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబర్ 10: వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని మామునూర్ ఎయిర్‌పోర్టును ప్రారంభించడానికి కసరత్తు షురూ అయింది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ప్రతినిధులు సోమవారం అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రోడ్లు, భవనాలు, విద్యుత్, ప్రజారోగ్యం, రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. మామునూర్ ఎయిర్‌పోర్టు కింద ప్రస్తుతం ఉన్న 706 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది. శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం సందర్భంగా 150 కిలో మీటర్ల పరిధిలో కమర్షియల్ విమానాశ్రమం నిర్మించకూడదని (వరంగల్ శంషాబాద్ విమానశ్రయానికి 146 కిలోమీటర్లు దూరం ఉంది) ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఉంది. దీంతో ఈ ఎయిర్ పోర్టు భూమికి 1981లో ప్రహరీ అప్పటి నుంచి నిరుపయోగంగా ఉందని కలెక్టర్ తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉడాన్ పథకం కింద ప్రాంతీయ అనుసంధానం కార్యక్రమంలో భాగంగా వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వెసులుబాటు కలిగిందని చెప్పారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. సాంకేతికపరంగా ఎయిర్‌పోర్టు ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఎయిర్‌పోర్టు భూమిని స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవియేషన్ అకాడమీకి భూమి కేటాయింపులు జరుగుతాయని, తదనంతరం వారం రోజుల్లో ఎయిర్‌పోర్టును ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా ఏవియేషన్ అకాడమీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ పరిధిలో బేగంపేట విమానాశ్రయం ఉందని, మామునూర్‌ను ప్రారంభిస్తే రెండో విమానాశ్రయం అవుతుందన్నారు. అలాగే రన్‌వే, తాగునీరు, విద్యుత్ సదుపాయాల కల్పనకు నిధుల కోసం రూ.8కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మామునూర్ ఎయిర్‌పోర్టుతో పారిశ్రామిక, విద్య, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని వారు తెలిపారు. టెక్స్‌టైల్‌పార్కు, రామగుండం పారిశ్రామిక అవసరాలకు కార్గో, డొమోస్టిక్ విమానాలు నడుస్తాయన్నారు. ఈ చర్చల్లో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ గౌరవ కార్యదర్శి కెప్టెన్ ఎస్‌ఎన్ రెడ్డి, గౌరవ అదనపు కార్యదర్శి జీబీ రెడ్డి, మెంబర్ కన్సల్టెంట్ పీఆర్‌పీ రావు, ఖిలా వరంగల్ తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ ఎం సత్యనారాయణ, ఈఈ రాజం, తదితరులు పాల్గొన్నారు.

273
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...