కుల గళం సంఘటితం..


Mon,September 10, 2018 03:35 AM

వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ:ఉమ్మడి రాష్ట్రంలో పడావుపడ్డ వృత్తికులాలన్నీ తెలంగాణలో పునరుజ్జీవనం పొందా యి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠే లక్ష్యం గా ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన అడుగుతో సబ్బండ వృత్తికులాలు సంఘటితమై తామెప్పటికీ టీఆర్‌ఎస్‌కు అండగా ఉం టామని స్పష్టం చేయబోతున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అం టున్నాయి. ముందెన్నడూలేనివిధంగా కులవృత్తులను పునరుజ్జీవింపజేసిన దార్శనికుడిగా సీఎం కేసీఆర్ తమ అత్యంత ఆరాధ్యుడంటూ ఆయా కులాలు కీర్తిస్తున్నాయి. కూనరిల్లిన కులాలు వికాసం వైపు పరుగులు తీసేందుకు దారి చూపిన టీఆర్‌ఎస్ పార్టీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని ఆయా కుల సంఘాల బాధ్యులు గతంలో ఎన్నడూలేనివిధంగా తొలిసారిగా బయటికి వస్తున్నాయి. సద్ది తిన్నా రేవు తలవాలె అన్నట్టు తమ కులానికి బలాన్నిచ్చిన టీఆర్‌ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తామెప్పుడూ రుణపడే ఉంటామని ఆయా కులాల బాధ్యులు తమతమ కులంలో తీర్మానం చేసుకుంటున్నామని ఆదివారం జరిగిన రెండు ప్రధాన ప్రతిజ్ఞలే స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకర్గంలోని కమలాపూర్ మండలం వంగపల్లిలో రజక కులస్థులు ఆయనకు మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. మరోవైపు వర్దన్నపేట నియోజకవర్గం పరిధిలో పెగడపల్లి ఒకటో డివిజన్‌లో కార్పొరేటర్ వీర భిక్షపతి నేతృత్వంలో సమావేశమై టీఆర్‌ఎస్ అభ్యర్థి అరూరి రమేష్‌ను గత ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ కంటే అత్యధికంగా గెలిపించేందుకు అందరూ నడుం కట్టాలని పిలుపు నివ్వడమే కాకుండా అరూరి రమేష్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఇక వరంగల్ తూర్పులో ముదిరాజ్ కార్పొరేటర్ బయ్యా స్వామి తమ కులాన్నే కాదు మొత్తం తెలంగాణలోని అన్ని కులాలను ఆదరించి, అక్కున చేర్చుకొని అండగా నిలబడ్డ మహానేత కేసీఆర్ వెంటే ఉంటామని ప్రకటించారు. ఖిలా వరంగల్‌లో కార్పొరేటర్ దామోదర్ యాదవ్ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తామని ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌లో నయా జోష్...
టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో పల్లెపట్నం అన్న తేడా లేకుండా అన్నిస్థాయిల గులాబీ శ్రేణుల్లో నయాజోష్ నెలకొన్నది. పార్టీ రాష్ట్ర స్థాయి నేతల నుంచి మొదలుకుంటే బూత్‌స్థాయి దాకా తమతమ ప్రాంతంలో గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలబెట్టాలన్న పట్టుదల కనిపిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలకు అధిష్టానం ఢిల్లీలో ఉంటే టీఆర్‌ఎస్ అధిష్టానం తెలంగాణ ప్రజలే అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 15 ఏళ్లు మడమ తిప్పకుండా అనేక అవాంతరాలు ఎదురైనా సరే పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్‌కి ఎనలేని కీర్తి సొంతం చేసుకున్నది.

అంతేకాకుండా రాష్ట్రం సాధించిన తరువాత అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అమోఘంగా ప్రగతిపథంలో ముందుకు తీసుకెళుతున్న పార్టీ సుశిక్షుతులైన కార్యకర్తలుగా ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలన్న వజ్రసంకల్పంతో కేడర్ ఉరకలెత్తే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నది. అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళతామని తమ అభ్యర్థుల గెలుపును ఎవరూ ఆపలేరని టీఆర్‌ఎస్ శ్రేణుల్లో సమరోత్సాహం తొణకిసలాడుతున్నది. అందులో భాగంగానే వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని ముగ్గురు కార్పొరేటర్లు దామోదర్‌యాదవ్, బయ్యా స్వామి తమకు పార్టీముఖ్యమని, ముఖ్యమంత్రి ఏ అభ్యర్థిని బరిలో నిలిపినా బరిగీసి కొట్లాడుతామని ప్రకటించారు. ఒకటో డివిజన్ కార్పొరేటర్ అయితే ఏకంగా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా అరూరి రమేశ్‌కు గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే అత్యధికంగా తెచ్చేందుకు పనిచేస్తామని ప్రకటిస్తూ తన డివిజన్ పరిధిలో ఆదివారం ప్రతిజ్ఞ కూడా చేశారు.

సంఘటిత శక్తిగా.. గులాబీలకు మద్దతుగా...
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమాజంలో మెజార్టీగా ఉంటూ అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన వలసల పాలై ఇతర కులాల్లో స్థిరపడి సర్వం కోల్పోయిన కులాలకు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. అన్నిరంగాల్లో సమ్మిళిత ప్రగతి సాధించాలంటే ముందుగా వృత్తులు బతకాల్సిన అనివార్యతను గుర్తించారు. అందులో భాగంగానే వివిధ కులాల వృత్తులకు పునరుజ్జీవం చెందేలా కార్యాచరణ చేపట్టారు. అసలిప్పటి వరకు ఎవరూ పట్టించుకోని, విస్మరణకు గురైన యాదవలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ చేసి ఆ కులంలో ఆర్థిక స్వాతంత్య్రం ను రుచిచూపారు. ఉపాధి లేక చిక్కి శల్యమైపోతున్న దశలో తమ కులస్తులు ముఖ్యమంత్రి కేసీఆర్ చలువ వల్ల బాగుపడ్డామని, ఇటువంటి తరుణంలో తాము సంఘటితమై టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడతామని, ఒకటి రెండు రోజుల్లో ఆల్ ఇండియా యాదవ మహాసభ సమావేశం కాబోతుందని ఆ సంఘం బాధ్యులు ప్రకటించారు.

పడావు పడ్డ చెరువులకు మిషన్ కాకతీయతో పునరుద్ధరణ చేయడం మాత్రమే కాదు కళకళలాడుతున్న చెరువుల్లో జలపుష్ప (చేప) విన్యాసం వికసిస్తున్నది. తామెప్పుడూ కలలో కూడా కలగని మేలు జరిగిందని ముదిరాజ్ కులస్తులు సగర్వంగా ప్రకటిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా వింటాం. మమ్మల్ని బాగుచేసింది ఎవరో? మాకు మాత్రమే తెలుసు. స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటికీ తమను పట్టించుకున్న పాపాన పోలేదు. అటువంటిది టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకున్నారని గతంలో తామెవరికి మద్దతు ఇచ్చామో కానీ ఇప్పుడైతే సంపూర్ణంగా టీఆర్‌ఎస్‌కు అండగా నిలస్తామని ముదిరాజ్ సంఘం ప్రతినిది బయ్యా స్వామి పేర్కొనడం విశేషం.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో దాదాపుగా తొలిసారిగా రజక కులస్తులు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం అంటూ వంగపెల్లి నుంచి సైరన్ మోగింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం వంగపల్లిలో రజకులు ఈసారి తమ మద్దతు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కేనని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే తాము టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించుకుంటామని, అయితే స్థానికంగా మండలాల్లో, గ్రామాల్లో తీర్మానాలు చేసి తరువాత భారీ ఎత్తున సభ నిర్వహించి టీఆర్‌ఎస్‌కు అభ్యర్థులను గెలిపించుకునేందుకు అవసరమైన వ్యూహం రచిస్తామని రజక కుల సంఘం బాధ్యులు పేర్కొన్నారు.

267
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...